కొత్తరకం కరోనా పరిస్ధితులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. యూకే నుంచి డిసెంబర్ 9 తర్వాత తెలంగాణకు 1,200 మంది వచ్చారని ఆయన తెలిపారు.

వీరిలో 846 మందిని గుర్తించి వైద్య పరీక్షలు చేయగా.. ఏడుగురికి పాజిటివ్‌గా వచ్చిందని ఈటల చెప్పారు. హైదరాబాద్, వరంగల్, సిద్ధిపేట, మేడ్చల్, జగిత్యాలలో పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి వెల్లడించారు.

ఏ రకం వైరస్ వుందో గుర్తించేందుకు శాంపిల్స్‌ను సీసీఎంబీ ల్యాబ్‌కు పంపామని ఈటల పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని కలిసిన వారందరినీ ట్రేసింగ్ చేస్తున్నామని ఈటల తెలిపారు.

Also Read:తెలంగాణ: యూకే నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి పాజిటివ్

నెగిటివ్ వచ్చిన వారిని సైతం మానిటరింగ్ చేస్తున్నట్లు రాజేందర్ వెల్లడించారు. బ్రిటన్‌ను వణికిస్తున్న మార్పు చెందిన కరోనా వైరస్ మనదేశంలోకి ప్రవేశించకుండా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.

అయితే ఇప్పటికే భారత్‌లోకి స్ట్రెయిన్ 70 వెళ్లిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కోవిడ్ విజృంభించకుండా అప్రమత్తమయ్యాయి.