తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ధీమాగా వున్నాయి. కాగా, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం 175వ బూత్‌లో కౌంటింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

31 ఓట్లు తక్కువగా వచ్చాయని.. అసలు పోలింగ్ జరిగిన ఓట్ల కంటే తక్కువ రావడం ఏంటని కాంగ్రెస్ ఏజెంట్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న ఆ బాక్స్‌ను అధికారులు పక్కనబెట్టేశారు. 

కాగా, తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఓట్లను బుధవారం లెక్కిస్తున్నారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం ఓట్ల లెక్కింపును హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుండగా, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపును నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహించనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తుది ఫలిత తేలేందుకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అభ్యర్ధులు ఎక్కువ మంది బరిలో దిగడం, పెరిగిన పోలింగ్‌తో పాటు జంబో బ్యాలెట్‌తో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

పెరిగిన పోలింగ్​తో పాటు జంబో బ్యాలెట్​తో కౌంటింగ్​ ప్రక్రియ అధికారులకు సవాల్​గా మారింది. దీంతో ఓట్ల లెక్కింపునకు రెండు రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా, మూడు షిప్టుల్లో ఓట్లను లెక్కించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.