ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ, వార్డ్ వాలంటీర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఈ క్రమంలో జగన్ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నడిచేందుకు సిద్ధమైంది.

కొత్తగా వార్డ్ ఆఫీసర్లను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండేలా వార్డు ఆఫీసర్లను నియమిస్తామని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణలోని ప్రతి పురపాలికల్లో వార్డు ఆఫీసర్లను నియమిస్తామన్నారు. దేశంలోనే తొలిసారిగా వార్డుకు ఒక అధికారిని నియమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పురపాలక శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని, తద్వారా పట్టణ ప్రగతి కార్యక్రమం మరింత వేగంగా ముందుకు పోతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

పౌరుడే కేంద్రంగా పౌరసేవలను ప్రజలకు వేగంగా అందించేందుకు, పట్టణాల క్రమానుగత అభివృద్ధికి వార్డు ఆఫీసర్ల నియామకం దోహదం చేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో నూతన పురపాలక చట్టం స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు వీలవుతుందన్నారు.