రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీసీ ఛార్జీలు పెంచుతూ  తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని సర్కార్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం (telanagna govt) షాకిచ్చింది. మరోసారి రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీసీ ఛార్జీలు (tsrtc charges) పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలు పెంచింది ప్రభుత్వం. పెంచిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. బస్సు సర్వీసుల్లో కనీస ధర రూ.10గా నిర్ణయించారు. పల్లెవెలుగు, సీటీ ఆర్డినరీ సర్వీసులకు రూ.2 పెంచారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీకి రూ.5 పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

కొద్దిరోజుల క్రితం అన్నిరకాల బస్‌పాస్‌ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ధరలు (Charges) ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. జనరల్‌ బస్‌ టికెట్‌ పాసుల కేటగిరిలో ఆర్డినరీ పాస్‌ (Ordinary Pass) చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెంచుతూ ఆర్టీసీ అధికారులు వివరాలు వెల్లడించారు. ఎన్‌జీఓ బస్‌పాస్‌లకు సంబంధించి ఆర్డినరీ పాస్‌ ఛార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్‌–ఆర్టీసీ కోంబో టికెట్‌ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది.

ఇటీవలే సేఫ్టీ సెస్‌ పేరుతో ఆర్టీసీ బస్ టికెట్‌పై రూపాయి పెంచి, చిల్లర సమస్య రాకుండా ధరను రౌండాఫ్‌ చేయటంతో గరిష్టంగా టికెట్‌ ధర రూ.5 మేర పెరిగింది. గతంలో రౌండాఫ్‌ ధర కాస్త ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో దాన్ని తగ్గించిన ఆర్టీసీ మళ్లీ పాత ధరలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. కరోనా లాక్‌డౌన్, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ తనదైనశైలిలో ముందుకు వెళ్తున్నారు. ఓవైపు ఆఫర్లు, ఫ్యాకేజీలతో ప్రయాణికులను ఆకర్షిస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. టీఎస్‌ఆర్టీసీ ఆర్ధిక పరిస్ధితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.