Asianet News TeluguAsianet News Telugu

మాట నిలబెట్టుకున్న కేసీఆర్: ఆర్టీసీ కార్మికుల ఖాతాల్లో పడిన సెప్టెంబర్ వేతనాలు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు వారి ఖాతాలలో జమ అయ్యాయి. తమ ఆదేశాలను కాదని కార్మికులు సమ్మెలో దిగడంతో ప్రభుత్వం సెప్టెంబర్ నెల వేతనాలను నిలిపివేసింది

telangana govt deposited rtc employees september month salaries
Author
Hyderabad, First Published Dec 2, 2019, 8:21 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు వారి ఖాతాలలో జమ అయ్యాయి. తమ ఆదేశాలను కాదని కార్మికులు సమ్మెలో దిగడంతో ప్రభుత్వం సెప్టెంబర్ నెల వేతనాలను నిలిపివేసింది. దీంతో కార్మికులు తమ కుటుంబసభ్యులతో కలిసి దసరా పండుగను సైతం జరుపుకోలేకపోయారు.

వేతనాలపై కార్మికులు హైకోర్టును సైతం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై సోమవారం వేతనాలను ఖాతాలోకి జమ చేస్తామని హామీ ఇచ్చారు. 

Also Read:జస్టిస్ ఫర్ దిశ: మొబైల్ ఫోన్ దొరకలేదు, 10 రోజుల కస్టడీ కోరిన పోలీసులు

మహిళా ఉద్యోగులు రాత్రి 8 గంటల లోపే విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని కేసీఆర్ సూచించారు. ఒక్క రూట్‌లో కూడా ప్రైవేట్ బస్సులకు అనుమతివ్వమని.. కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి కలకాలని ముఖ్యమంత్రి తెలిపారు.

యధావిధిగా ఉద్యోగుల ఇంక్రిమెంట్లు ఇస్తామని.. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ఇస్తామని సీఎం వెల్లడించారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి 8 రోజుల్లోపు ఉద్యోగం కల్పిస్తామని.. కలర్ బ్లైండ్‌నెస్ వున్న వారిని వేరే విధులకు మార్చాలి తప్ప వారిని తొలగించవద్దని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు 3 నెలల చైల్డ్ కేర్ లీవ్స్ ఇస్తామని, మహిళా ఉద్యోగులకు ఖాకీ డ్రెస్ నిబంధన తొలగిస్తామని సీఎం స్పష్టం చేశారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామని, రెండేళ్లపాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు ఉండవని సీఎం తేల్చి చెప్పారు.

ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, ప్రతి ఆర్టీసీ ఉద్యోగికి ఏడాదికి లక్ష బోనస్ అందించే పరిస్ధితి రావాలని కేసీఆర్ వెల్లడించారు. 

రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ గత శుక్రవారం ఉదయం యధావిథిగా విధులకు హాజరు కావొచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రమే తమకు రూ.22 వేల కోట్లు ఇవ్వాలని, కానీ కేంద్రం వాటా గురించి చెప్పేవాళ్లు ఈ డబ్బు ఇప్పిస్తారా అని సీఎం ప్రశ్నించారు.

Also Read:తెలంగాణ నిర్భయ హత్య: నిందితుల వీడియో తీసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

ఆర్టీసీకి తక్షణ సాయంగా రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి నష్టాలను పూడ్చేందుకు ఆసరా కల్పిస్తామని... కి.మీ.20 పైసలు చొప్పున పెంచుతామని సోమవారం నుంచి ఛార్జీలు అమల్లోకి వస్తాయని సీఎం స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios