ఖమ్మం జిల్లా చీమలపాడులో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో బాధితుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది

ఖమ్మం జిల్లా చీమలపాడులో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో బాధితుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్ధిక సాయంతో పాటు ఉచితంగా వైద్యం అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కాగా.. చీమలపాడులో బీఆర్ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న చోటుకు సమీపంలో గుడిసెలో గ్యాస్ సిలిండర్‌ పేలిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఖ‌మ్మం జిల్లా బీఆర్ఎస్ నేత‌ల‌తో, అధికారుల‌తో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. మృతుల కుటుంబాలు, క్ష‌త‌గాత్రుల‌ను ఆదుకుంటామ‌న్నారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని కేటీఆర్ ఆదేశించారు.

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములుతో పాటు పలువురు పార్టీ నేతలు చీమలపాడుకు విచ్చేశారు. పార్టీ నేతల రాక సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. అయితే ప్రమాదవశాత్తు బాణసంచా నిప్పురవ్వలు పడి సమీపంలోని గుడిసెలో మంటలు చెలరేగినట్టుగా చెబుతున్నారు. 

ఈ ఘటనలో గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. గాయపడినవారిని పోలీసు వాహనాల్లోనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కొందరి కాళ్లు, చేతులు కూడా తెగిపడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాన్ని నిలిపివేశారు.