హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా దర్బార్ నిర్వహిస్తానంటూ కీలక నిర్ణయం ప్రకటించిన ఆమె తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. 

ఇకపై గిరిజన తండాల్లో బస చేయాలని నిర్ణయించుకున్నారు. రాజభవన్ లో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై గవర్నర్ ఆరా తీశారు. 

రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ కు వివరించారు అధికారులు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. 

అనంతరం గిరిజన తండాలో తాను పర్యటించాలని భావిస్తున్నట్లు తమిళసై సౌందరరాజన్ తెలిపారు. గిరిజన తండాలో ఒకరోజు బస చేయనున్నట్లు  అధికారులకు స్పష్టం చేశారు. అలాగే ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు తాను సహకరిస్తానని అధికారులకు తమిళసై సౌందరరాజన్ హామీ ఇచ్చారు. 

 

తాను త్వరలోనే పర్యటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తానని అప్పుడు అన్ని ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించారు. ఇకపోతే గవర్నర్ సౌందర రాజన్ గిరిజన తండాలో పర్యటించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం తీరుపై తమిళసై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వంపై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ మరోవైపు ఆర్టీసీ కార్మికులు ఇలా వరుస ఫిర్యాదులు రావడంపై ఆమె గుర్రుగా ఉన్నారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన ఆమె రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై కేంద్రానికి నివేదిక సైతం సమర్పించారు. 

తమిళసై సౌందరరాజన్ నేరుగా ప్రజావ్యవస్థలోకి వెళ్తే టీఆర్ఎస్ పార్టీకి కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. గిరిజన తండాలో ఆమె బస చేస్తే గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, పోడు వ్యవసాయం, భూ పంపిణీ, కుల వివాదాలు వంటి అంశాలపై ఆమె ఆరా తీస్తే ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. 

ప్రభుత్వ లోపాలను గవర్నర్ ప్రజల సమక్షంలోనే ఎండగడితే కేసీఆర్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితి. లేకపోతే నేరుగా ఆమె కేంద్రానికి ఫిర్యాదు చేసి నిధులు రప్పించి గిరిజనుల అభివృద్ధికి పాటుపడితే అది కూడా ప్రభుత్వానికి మింగుడు పడే అవకాశం లేకపోలేదు.   

ఇప్పటి వరకు వచ్చిన గవర్నర్ లు కేవలం రాజభవన్ కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదకర ఘటనలను స్వయంగా పరిశీలించడం లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం వెళ్లిపోవడం జరిగేవి. 

కానీ తమిళసై అలా రాజభవన్ కు పరిమితం కాకుండా నేరుగా ప్రజల్లోకి రావడంపై ఇతర పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. గవర్నర్ రాకతోనైనా తెలంగాణలో పరిస్థితులు మారతాయని వారు అభిప్రాయపడుతున్నారు. మరి తమిళసై పర్యటనలు ఎలా ఉండబోతాయో అనేది వేచి చూడాలి.