తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సమస్యతో సతమతమౌతున్న ఓ మహిళా రైతుకు ఆమె సహాయం అందించారు. తన దగ్గరకు వచ్చిన ప్రజా సమస్యలను ఆమె సామరస్యంగా పరిష్కరిస్తున్నారు. తాజాగా... ఆమె ఓ మహిళా రైతుకి చేసిన సహాయం అందరినీ ఆకట్టుకుంది.

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం  పెంటకలాన్ గ్రామం భూలక్ష్మీ క్యాంప్ కి చెందిన పేరం సీతారామమ్య భర్త రామిరెడ్డి  చనిపోవడంతో ఆయన పేరిట ఉన్న 4.30 ఎకరాలను విరాసత్ చేయాలని తహసీల్దార్ ని కోరింది. సర్వే నంబర్లలో విస్తీర్ణం పెరిగిందని, సరిచేసే దాకా పాస్ పుస్తకాలు ఇవ్వలేమని, ఏడాది దాకా ఆగాలని తహసీల్దార్ ఆమెతో చెప్పారు.

Also Read బిర్యానీలో ఇనుప తీగ.. రెస్టారెంట్ కి భారీ జరిమానా..

వెంటనే ఆమె ఆర్డీవో దగ్గరకు వెళ్లి తన బాధంతా వెల్లగక్కింది. అయితే... నీ ఒక్కదాని పనే చేయాలా? మాకు చాలా పనులు ఉంటాయి అంటూ విసుక్కున్నారు. కలెక్టరేట్ లో జరిగే ప్రజావాణనిలో కలెక్టర్ కు వినతిపత్రం  ఇచ్చింది. దాదాపు ఐదు నెలలపాటు తనను తిప్పుకుంటూనే ఉన్నారు. విసిగిపోయిన  సీతారామమ్మ, ఆమె కుమారుడు వెంకటేశ్వర్ రెడ్డి గవర్నర్ తమిళిసైకి ఫోన్ చేశారు.

గవర్నర్‌.. రాజ్‌భవన్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌కు పురమాయించారు. ఆయన జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సీతారామమ్మను తన వద్దకు పిలిపించుకున్నారు. కలెక్టర్‌ తన వేలిముద్రతో మ్యుటేషన్‌ పత్రాలపై డిజిటల్‌ సంతకాలు చేయడం, అప్పటికప్పుడే పాస్‌ పుస్తకం జిరాక్స్‌ తీసుకొని రైతుకు ఇవ్వడం చకాచకా జరిగిపోయాయి. ఇదంతా మూడు రోజుల్లోనే పూర్తయింది. ఇలాంటి సమస్యల నేపథ్యంలోనే గవర్నర్‌ ప్రజా దర్బార్‌ నిర్వహిస్తుండటం గమనార్హం.