బిర్యానీ తిందామని ఓ వ్యక్తి జొమాటోలో ఆర్డర్ పెట్టాడు. కొద్ది సేపటికే ఆర్డర్ పెట్టిన బిర్యానీ వేడి వేడిగా ఇంటికి చేరింది. ఆశగా బిర్యానీ తిందామని నోట్లో పెట్టుకుంటే... ఏదో తగిలింది. తీసి చూస్తే.. ఏముంది ఓ ఇనుప తీగ. అంతే... వెంటనే జొమాటోకి ఫిర్యాదు  చేయడంతో... సదరు రెస్టారెంట్ కి జరిమానా విధించారు. ఈ సంఘటన కూకట్ పల్లిలో చోటుచేసుకుంది.

Also Read నేను సీఎం బంధువుని... నా కారే ఆపుతావా?

పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లికి చెందిన శ్రీనివాస్ జొమాటో లో బిర్యానీ, కర్డ్ రైస్ ఆర్డర్ చేశాడు. కాసేపటికే జొమాటో లో చేసిన ఆర్డర్ వచ్చింది. శ్రీనివాస్ ముందుగా బిర్యానీ తినడం ప్రారంభించారు. బిర్యానీ తింటుండగా నోట్లో పంటి కింద గట్టిగా తగిలింది.  ఏమిటా అని వేలితో బయటకు తీయగా... ఇనుప తీగ కనిపించింది. దీనిపై వెంటనే  జొమాటో టీంకు శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు.

కాగా...జొమాటో శ్రీనివాస్ కి క్షమాపణలు  చెప్పి, డిస్కౌంట్ కూపన్ ఇచ్చారు. అనంతరం శ్రీనివాస్ జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ట్విట్టర్ లో బిర్యానీ విక్రయించిన రెస్టారెంట్ పై ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కూకట్ పల్లిలోని రాజావారి రుచులు రెస్టారెంట్ లో తనిఖీలు చేసి ఐదువేల రూపాయల జరిమానా విధించారు. బిర్యానీలో ఇనుప తీగ వచ్చిన ఘటనపై తాను వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని శ్రీనివాస్ చెప్పారు. కాగా దీనిపై తాము తగిన చర్యలు తసీుకుంటామని జొమాటో పేర్కొంది.