ఆర్టీసీ విలీనంపై రగడ: ఆ విషయం తెలిసి బాధపడ్డాను.. గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరిన సంగతి తెలిసిందే.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆర్టీసీ బిల్లును ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) హెచ్చరించింది. అలాగే ఈరోజు ఉదయం రెండు గంటల పాటు చాలా వరకు ఆర్టీసీ బస్సులు రోడ్లు ఎక్కలేదు. అయితే ఉదయం 8 గంటల తర్వాత కూడా కొన్ని సంఘాలు బంద్ పాటిస్తుండటంతో.. తక్కువ సంఖ్యలో బస్సులు నడుస్తుండటంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు.. రాజ్‌భవన్ ఎదుట బైఠాయించి నిరనస వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ విలీన బిల్లకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఆర్టీసీ కార్మికుల నిరసనల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోందని తెలిసి బాధపడ్డానని పేర్కొన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సమయంతో తాను వారి వెంటే ఉన్నానని చెప్పారు. అయితే ఇప్పుడు కూడా వారి హక్కులను కాపాడేందుకు.. ప్రభుత్వం పంపిన బిల్లును శ్రద్దగా అధ్యయనం చేస్తున్నట్టుగా వెల్లడించారు.
మరోవైపు ఆర్టీసీ యూనియన్ నాయకులను గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చర్చలకు రావాలని రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. ఉదయం 11.30 గంటలకు ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చిస్తామని గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం తాను పుదుచ్చేరిలో ఉండటంతో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ యూనియన్ నాయకులతో మాట్లాడనున్నట్టుగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చెప్పారు. ఈ క్రమంలోనే 10 మంది ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను రాజ్‌భవన్ వర్గాలు లోనికి అనుమతించాయి.