తెలంగాణలో రాజ్‌భవన్‌కు - ప్రగతి భవన్‌కు మధ్య దూరం నానాటికీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ భద్రాద్రి పర్యటనలో మరోసారి ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. గవర్నర్ తమిళిసై భద్రాద్రి పర్యటనకు కలెక్టర్, ఎస్పీ గైర్హాజరవ్వడం వివాదాస్పదంగా మారింది.
తెలంగాణ గవర్నర్ (telangana governor) తమిళిసై సౌందర రాజన్ (Tamilisai Soundararajan) భద్రాద్రి జిల్లా పర్యటనలో ప్రోటోకాల్ (protocol controversy) పాటించకపోవడం మరోసారి వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై గవర్నర్ స్పందించారు. ప్రోటోకాల్ సమస్యపై చెప్పాల్సిన చోట చెప్పానని... ఇప్పుడు దాని గురించి మాట్లాడేది ఏం లేదన్నారు. గిరిజనులను కలుసుకోవడం ఆనందంగా వుందన్నారు. మరోవైపు.. గవర్నర్ ప్రోటోకాల్ వివాదంపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) . ఎందరో సీఎంలు వచ్చారు, పోయారని.. కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేయొద్దని కోరారు . గవర్నర్ వ్యవస్థ మీద కత్తులు నూరడం సరికాదని కిషన్ రెడ్డి హితవు పలికారు. ఒక ఎమ్మెల్సీ విషయంలో చెప్పినట్లు చేయలేదనే.. ఇలా చేస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి.
ఇకపోతే.. గవర్నర్ తమిళిసై భద్రాద్రి పర్యటనకు కలెక్టర్, ఎస్పీ గైర్హాజరవ్వడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. భద్రాద్రి పర్యటనలో భాగంగా సీతారామస్వామిని తమిళిసై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మిథిలా స్టేడియంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు. భక్త రామదాసు నిర్మించిన ఆలయాన్ని, సీతారాములను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కాగా, ఏప్రిల్ 7న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (amit shah) భేటీ అయ్యారు. ఆమె తెలంగాణలో ప్రోటోకాల్ వివాదం, ప్రస్తుత పరిస్థితులను అమిత్ షాకు వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ అంశాలతో అమిత్ షాతో చర్చించానని తెలిపారు. అమిత్ షాతో చర్చించిన విషయాలు బయటకు చెప్పలేనని అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఎప్పుడూ ఆలోచిస్తానని చెప్పారు. తెలంగాణలో తాను రైలు, రోడ్డు మార్గంలో మాత్రమే ప్రయాణించగలను అని అన్నారు. ఎందుకో మీరే అర్థం చేసుకోండని మీడియాతో అన్నారు.
అంతేకాదు తన విషయంలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలకు తెలుసునని అన్నారు. తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని చెప్పారు. తాను అందరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తినని తెలిపారు. రాజ్ భవన్ తెలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. సీఎం, మంత్రులు, సీఎస్ రాజ్ భవన్ కు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. తనతో సమస్య ఉంటే ఎవరైనా వచ్చి చర్చించవచ్చు అని చెప్పారు.
యాదాద్రి ఆలయాన్ని తన కుటుం సమేతంగా దర్శించుకున్నట్టుగా చెప్పారు. యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ తనను కలవలేదని చెప్పారు. యాదాద్రికి తాను బీజేపీ వ్యక్తిగా వెళ్లానని వాళ్లు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. రెండేళ్లలో తాను బీజేపీ నాయకులను కేవలం ఒకటి, రెండుసార్లే కలిశానని తెలిపారు. తమిళిసైని కాకపోయినా రాజ్ భవన్ ను గౌరవించాలన్నారు. తాను ఎవరినీ విమర్శించట్లేదని చెప్పారు. తెలంగాణలో రాజ్ భవన్, గవర్నర్ విషయంలో ఏం జరుగుతందో మాత్రమే చెబుతున్నానని అన్నారు.
