హైదరాబాద్: జనసేన అధ్యక్షులు, ప్రముఖ సినీ నటులు పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఇరు తెలుగురాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఆయన అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ భారీ ప్లెక్సీలు, కటౌట్లు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటుండగా రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికన బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇలా తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

''పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆయురారోగ్యాలతో,  భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను'' అంటూ గవర్నర్ తమిళసై ట్వీట్ చేశారు.

ఇక తెలుగురాష్ట్రాల్లోనే కాదు జాతీయస్థాయిలో పవన్ కళ్యాణ్ బర్త్‌ డే సందడి మామూలుగా లేదు. కొద్ది రోజుల క్రిందటే పవన్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన అభిమానులు తాజాగా బర్త్‌ డే రోజు తమ రికార్డ్‌ను తామే బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచే #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. కేవలం 8 నిమిషాల్లోనే ఈ ట్యాగ్‌పై 2 మిలియన్ల పోస్ట్‌లు వచ్చాయంటే పవన్‌ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

బుధవారం కూడా అదే జోరు కనిపిస్తోంది. ఇప్పటికే పవన్‌ బర్త్‌ డే స్పెషల్ హ్యాష్‌ ట్యాగ్‌కు కోటీ 20 లక్షలకు పైగా ట్వీట్స్‌ వచ్చాయి. ప్రస్తుతం ఈ  హ్యాష్ ట్యాగట్ నేషనల్‌ లెవల్‌లో నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుండటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. గత హీరోల రికార్డ్‌లను బద్ధలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఈ రోజు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా ఉండటంతో అభిమానులు మరింతగా హడావిడి చేస్తున్నారు.

అభిమానుల సందడి సోషల్ మీడియాలో ఈరోజంతా కనిపిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జోరు కొనసాగితే అన్‌ బీటబుల్‌ రికార్డ్‌ సెట్ చేయటం గ్యారెంటీ అంటున్నారు పవర్‌ స్టార్ ఫ్యాన్స్.