హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవిన్యూ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవిన్యూ బిల్లులను ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించింది. ఈ నెల 11వ తేదీన ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. అసెంబ్లీతో పాటు శాసనమండలిలో కూడ ఈ బిల్లులు ఆమోదం పొందాయి.

ఈ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. గవర్నర్ ఈ బిల్లును ఆమోదించారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపంలోకి మారాయి.కొత్త రెవిన్యూ చట్టం ప్రకారంగా భూముల రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఎమ్మార్వోలకే ప్రభుత్వం కట్టబెట్టింది.

also read:కొత్త రెవిన్యూ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

ఈ మేరకు చట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించింది. ఈ మేరకు న్యాయశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

రిజిస్ట్రేషన్ తో పాటు మ్యూటేషన్ ను ఒకరోజు చేయనున్నారు. కొత్త చట్టం ద్వారా 30 నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయనుంది.

ధరణి వెబ్ సైట్ లో రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమికి సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చనున్నారు.  ఇప్పటికే వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.ధరణి పోర్టల్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.