పెండింగ్‌లో బిల్లులు: నేడు ఢిల్లీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై, ఏం జరుగుతుంది?
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారంనాడు న్యూఢిల్లీ వెళ్లనున్నారు. కేసీఆర్ సర్కార్ కు , గవర్నర్ కు మధ్య బిల్లుల విషయంలో వివాదం సాగుతున్న తరుణంలో తమిళిసై ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గురువారంనాడు న్యూఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులు ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదించలేదు. ఈ తరుణంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించకుంది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వద్ద పెండింగ్ లో బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఈ తరుణంలో మూడు బిల్లులకు రాష్ట్ర గవర్నర్ ఇటీవలనే ఆమోదం తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 3న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి 31న రాష్ట్ర బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపడం లేదని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు సూచన మేరకు రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వ లాయర్లు రాజీ ప్రతిపాదన తీసుకువచ్చారు తమ మధ్య రాజీ కుదిరిందని అడ్వకేట్లు హైకోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకుంది.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి గవర్నర్ కు ప్రభుత్వం నుండి ఆహ్వానం అందింది. అయితే ఈ పరిణామం ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరిందని భావించారు. కానీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత పెండింగ్ బిల్లుల అంశానికి సంబంధించి తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చకు దారితీసింది. ఈ తరుణంలో తమిళిసై ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కూడా గవర్నర్ కలిసే అవకాశం ఉందని సమాచారం.