హైదరాబాద్: ఈ నెల 12,13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.ఈ విషయమై ఈ నెల 9వ తేదీన స్పష్టత రానుంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. దీంతో ఈ సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

దీనికి తోడుగా హైకోర్టు సూచించిన కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉంది. దీన్ని పురస్కరించుకొని ఆయా బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. 

ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించారు. బీఏసీ సమావేశంలో అదే నెల 28వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని భావించారు. 

అయితే అసెంబ్లీ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందితో పాటు ప్రజా ప్రతినిధులకు కరోనా సోకడంతో సెప్టెంబర్ 16వ తేదీనే అసెంబ్లీ సమావేశాలను అర్ధాంతరంగా ముగించారు. 

అయితే అప్పటికి ప్రభుత్వం తాము ప్రవేశపెట్టాల్సిన బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే తాజాగా మరికొన్ని బిల్లులను కూడ ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రత్యేకంగా రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది.