తెలంగాణలోని రేషన్ డీలర్లకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ డీలర్ల కమీషన్‌ను మెట్రిక్ టన్నుకు రూ.1400కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలోని రేషన్ డీలర్లకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ డీలర్ల కమీషన్‌ను మెట్రిక్ టన్నుకు రూ.1400కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌తి ఏడాది అద‌నంగా రూ. 139 కోట్ల భారం ప‌డ‌నుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో గతకొద్దిరోజులుగా తమ సమస్యలపై రేషన్ డీలర్లు పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రేషన్ డీలర్ల సంఘాలతో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్‌లు ఈరోజు సచివాలయంలో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలమయ్యాయి. 

ఈ క్రమంలోనే మెట్రిక్ టన్నుకు ప్ర‌స్తుత‌ం ఉన్న క‌మీష‌న్ రూ. 900 నుండి రూ. 1400 లకు ముఖ్యమంత్రి ఆదేశంతో పెంచుతున్నట్టు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,227మంది రేషన్ డీలర్లకు లబ్ది చేకూర‌నుందని.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ. 139 కోట్ల అధనపు భారం పడుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో మెట్రిక్ టన్నుకు కేవలం రూ. 200 క‌మీష‌న్ మాత్రమే ఉండేదని.. ప్రస్తుతం దానిని రూ. 1400 లకు పెంచామన్నారు. అతి తక్కువ సమయంలో 700 శాతం కమిషన్ పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు. 

అలాగే కరోనా సమయంలో చనిపోయిన 100 మంది డీలర్ల వారసులకు షాపులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ. 5 లక్షల బీమా అమలు చేయడం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి ప్రతీ డీలర్‌ను తీసుకురావడం, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద క‌చ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్‌షిప్‌ రెన్యూవల్‌ని ఐదేండ్ల‌ కాలపరిమితికి పెంచడం, రేషన్ డీల‌ర్‌షిప్ వయోపరిమితిని 40 నుండి 50 ఏండ్ల‌కు పెంచ‌డం, అంత్యక్రియల సాయం తదితర 13 ప్రధాన అంశాల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలత చూపించింది. ఇక, డీలర్ల కమీషన్ పెంపు సహా తమ ఇతర సమస్యల పరిష్కరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేషన్ డీలర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.