హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులను కవరేజ్ చేయడానికి ప్రభుత్వం అనుమతించలేదు. ఈ విషయాన్ని హైకోర్టుకు ప్రభుత్వం శుక్రవారం నాడు తెలిపింది. ఈ విషయమై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కవరేజీకి అనుమతివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.

తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీపై శుక్రవారం నాడు కూడ హైకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై మీడియాకు అనుమతివ్వకపోవడం అనుమానాలకు దారితీస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ప్రాంతాల నుండి కవరేజ్ ను ఎందుకు అడ్డుకొంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. 

సచివాలయం కూల్చివేత పనుల కవరేజీకి మీడియాను అనుమతించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తేల్చి చెప్పింది.  కరోనా బులెటిన్ మాదిరిగా సచివాలయం కూల్చివేతలపై బులెటిన్ ఇస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 

పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్నయాలు తీసుకొంటుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. 

also read:తెలంగాణ సచివాలయం కూల్చివేతలో గోప్యత ఎందుకు: హైకోర్టు ప్రశ్న

అనంత పద్మనాభస్వామి ఆలయ సందప కవరేజీపై ఆంక్షలు లేవనే విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రభుత్వ నిర్ణయం చూసి రేపు ఈ విషయమై తుది నిర్ణయం తీసుకొంటామని కోర్టు తెలిపింది. 

సచివాలయం కూల్చివేతల ప్రత్యక్ష కవరేజీకి అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఈ పిటిషన్ కు చట్టబద్దంగా ఎలాంటి అర్హత లేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారు. ఈ పిటిషన్ కు ఎందుకు అర్హత లేదో చెప్పాలని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు కోరింది.