హైదరాబాద్:లాక్ డౌన్ నేపథ్యంలో ట్యాక్స్ వసూలును నిలిపివేయకపోతే  అత్యవసర సరుకుల రవాణాను కూడ నిలిపివేస్తామని లారీ యజమానుల అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గాను కేంద్రం మే 3వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ మే 7వ తేదీ వరకు అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ ఏడాది మార్చి 23వ  తేదీ నుండి రాష్ట్రంలోని లారీలు, డీసీఎంలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.  రాష్ట్రంలో 1.70 లక్షల డీసీఎంలు, లారీలు ఉంటాయి. వీటిలో 20 శాతం వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. అత్యవసర సరుకులు తరలించేందుకు మాత్రమే వీటిని వినియోగిస్తున్నారు.ఈ నెల 20వ తేదీ నుండి సరుకులు తరలించే వాహనాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదు. 

ప్రతి మూడు మాసాలకు ఓ సారి రోడ్డు ట్యాక్స్ ను చెల్లించాలి. మరో వైపు ఇన్సూరెన్స్ ను కూడ చెల్లించాల్సి ఉంటుంది. లారీలు రోడ్డుపైనే ఉన్న కారణంగా తాము రోడ్డు ట్యాక్స్ చెల్లించలేమని లారీ యజమానుల అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. 

also read:లాక్‌డౌన్ దెబ్బ: కోటిన్నర లీటర్ల బీర్లు ఇక డ్రైనేజీ పాలేనా.......

ఈ విషయాన్ని పరిశీలించాలని రవాణశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయమై తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం రాలేదని లారీల యజమానుల అసోసియేషన్ చెబుతుంది.

సరుకులు తరలించే 1.70 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటితో పాటు ఇతర రవాణ వాహనాలు ఆరు లక్షలు ఉన్నాయి. అయితే సరుకులు రవాణా చేసే వాహనాలకు రోడ్డు ట్యాక్స్ ను మినహయిస్తే ఇతర వాహనాలకు కూడ చెల్లింపును నిలిపివేయాలనే డిమాండ్ వచ్చే అవకాశం ఉందనే అధికార వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమౌతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.దీంతో ఈ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు. 

రోడ్డు ట్యాక్స్ చెల్లింపును నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వకపోతే ఈ నెల 30వ తేదీ నుండి అత్యవసర సరుకులు సరఫరా చేసే వాహనాలను కూడ నిలిపివేస్తామని లారీ యజమానుల అసోసియేషన్ హెచ్చరించింది.