telangana elections Polling 2023 : జనగామలో మళ్లీ ఉద్రిక్తత.. కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు..
జనగామలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
జనగామ : జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొంది. గురువారం ఉదయం నుంచి జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంటోంది. తాజాగా 214 పోలింగ్ బూతు దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య దాడి జరిగింది. ఒకరిమీద ఒకరు రాళ్లదాడులు, బూతులతో ఘర్షణకు దిగారు. అంతకు ముందు ఉదయం జనగామ రైల్వే స్టేషన్ సమీపంలోని పోలింగ్ బూతు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థఇ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువసేపు పోలింగ్ బూత్ దగ్గరే ఉంటున్నారని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాగ్వాదంగా మొదలై.. ఘర్షణకు దారి తీసింది.
మొదట జనగామ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యమవుతుందని అది కనుక్కోవడానికి అక్కడికి వెళ్లినట్టుగా బీఆర్ఎస్ వాళ్లు చెబుతున్నారు. అయితే, ఈ క్రమంలో పార్టీ కండువాలు కప్పుకుని వస్తున్నారని, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని.. ఎక్కువ సమయం బూత్ లలో ఉంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. ఇది ఘర్షణకు దారితీసింది.
ఘర్షణ నేపథ్యంలో పోలీసులు కలగచేసుకున్నారు. ఇరు వర్గాలను కేంద్రాల దగ్గరినుంచి బైటికి పంపారు. గొడవ సద్దుమణికి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.