ఎస్సీ వర్గీకరణపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్
ఎస్సీ వర్గీకరణపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ అసెంబ్లీ రెండు సార్లు తీర్మానం చేసిందనీ, కానీ, ఇన్నాళ్లపాటు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం వహిస్తున్నదని నిలదీశారు.
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అంశం పై మళ్లీ చర్చ రాజుకుంటుంది. ఈ విషయమై ఎంఆర్పీఎస్ శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ఎంఆర్పీఎస్ సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ రెండు సార్లు తీర్మానం చేసినప్పటికీ తొమ్మిదిన్నరేళ్లుగా కేంద్రం జాప్యం వహిస్తున్నదని ఫైర్ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వానికి లేని సమస్య కేంద్ర ప్రభుత్వానికి ఏముందని ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎస్సీ వర్గీకరణకు కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. అప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించుకుంటుందనీ చెప్పారు.
Also Read: బీజేపీ ‘హంగ్’ ఆశలు? ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు దేనికి సంకేతం?
ఎస్సీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పాటుపడుతున్నదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఎమ్మెల్సీ, ఇతర పదవుల్లోనూ ఎస్సీల ప్రాతినిధ్యం పెంచే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లుతామని వివరించారు.