హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడు.. ఎక్కడ జరిగినా... లగడపాటి సర్వే  ఏం  చెబుతోందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే లగడపాటి రాజగోపాల్‌ సర్వే చెప్పినట్టుగానే  ఎన్నికల ఫలితాలు ఉంటాయి. అందుకే ఈ సర్వేలంటే చాలా ఆసక్తి ఉంటుంది. 

పార్లమెంట్ ఎన్నికలైనా.. అసెంబ్లీ ఎన్నికలైనా... ఉప ఎన్నికలైనా రాజగోపాల్ నిర్వహించే సర్వే ఫలితాలు  ప్రజల నాడికి దగ్గరగా ఉంటాయి.2014  ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  విభజన జరిగితే  రాజకీయ సన్యాసం చేస్తానని లగడపాటి రాజగోపాల్  ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగింది దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి  డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  ఏ పార్టీ విజయం సాధిస్తోందో... ఏ అభ్యర్థి విజయం సాధిస్తారో అనే విషయమై  లగడపాటి సర్వే పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై  లగడపాటి రాజగోపాల్  వివరణ కూడ ఇచ్చారు. ఇంతవరకు తాము  సర్వే నిర్వహించలేదన్నారు. ఎవరైనా కోరితే తాను  సర్వేలను నిర్వహిస్తామన్నారు.   

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే ఫలితాలను లగడపాటి రాజగోపాల్ ఎన్నికల తర్వాత విడుదల చేస్తానని ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత  లగడపాటి రాజగోపాల్ సర్వే  నిర్వహిస్తారు. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత సర్వే ఫలితాలను  విడుదల చేసే అవకాశం ఉంది. 

1989లో ప్రఖ్యాత జర్నలిస్ట్ ప్రణయ్ రాయ్  ఎన్నికల ఫలితాలపై అలవోకగా  అభిప్రాయాలను   ఆనాడు దూరదర్శన్‌లో చెబుతున్న సమయంలో  లగడపాటి  రాజగోపాల్  చూశాడు. ప్రణయ్‌రాయ్‌ను స్పూర్తిని  తీసుకొని  ఎన్నికల్లో ప్రజల నాడిని  పట్టుకోవాలనే  స్పూర్తితో  ఎన్నికల్లో ప్రజల నాడిని పట్టుకొనేందుకుగాను సర్వే చేయడాన్ని ప్రారంభించారు. ప్రణయ్ రాయ్‌పై ప్రేమ కారణంగా  తన కొడుకుకు కూడ ప్రణయ్‌ అనే పేరు పెట్టుకొన్నాడు. 

2004 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వస్తోందని లగడపాటి రాజగోపాల్  నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వే ఫలితాలను  గులాం నబీ ఆజాద్  ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇచ్చారు.  కానీ ఈ ఫలితాలను  ఆ పార్టీ నేతలు ఆ సమయంలో నమ్మలేదు.  టీడీపీకి కేవలం 50 లోపుగానే సీట్లు వస్తాయని  లగడపాటి సర్వే తేల్చి చెప్పింది.

లగడపాటి రాజగోపాల్ సర్వే  చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీడీపీకి అతి తక్కువ సీట్లు వచ్చాయి.  దీంతో గులాం నబీ ఆజాద్‌కు లగడపాటి రాజగోపాల్‌పై గురి కుదిరింది.  ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పటి చీఫ్ సోనియా గాంధీ లగడపాటి రాజగోపాల్ తో సర్వేల గురించి, ఫలితాల గురించి చర్చించేవారు.

కడప లోక్‌సభ  స్థానం నుండి జగన్ పోటీ చేసిన సమయంలో జగన్‌కు సుమారు 4 లక్షల కంటే మెజారిటీ వస్తోందని  లగడపాటి చెప్పారు. ఈ సర్వే ఫలితాలపై   సోనియా  ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ లగడపాటి రాజగోపాల్  చెప్పినట్టుగానే  జగన్ కు భారీ మెజారిటీ వచ్చింది.

2007లో ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికలపై మొదటిసారిగా ఆర్‌జీ ఫ్లాష్‌ టీమ్‌ పేరిట ఏలూరుకు చెందిన తన మిత్రుడు యర్రంశెట్టి శ్రీనివాస్ తో కలిసి తన సొంత టీంతో లగడపాటి సర్వే చేశారు. ఆ సర్వే ఫలితాలు నూటికి నూరు శాతం నిజమయ్యాయి.

2009లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 155 అసెంబ్లీ, 33 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని తన సర్వే వివరాలను లగడపాటి హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాకు వెల్లడించారు. 

ఆయన చెప్పినట్లుగానే కాంగ్రెస్ కు 33 లోక్‌సభ సీట్లు వచ్చాయి. కానీ, కాంగ్రెస్ పార్టీకి  156 అసెంబ్లీ సీట్లొచ్చాయి. ఈ ఫలితాలను అప్పటి సీఎం వైఎస్ఆర్ కూడ నమ్మలేదు..

2010లో టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు 10 స్థానాలకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. మొత్తం 10 సీట్లలోనూ టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని లగడపాటి జోస్యం చెప్పగా అది నిజమైంది. రాష్ట్ర విభజన జరిగాక 2014లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్‌, కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తారని లగడపాటి చెప్పారు. 

తెలంగాణ విషయంలో ఆ సర్వేను విశ్వసించినా, ఏపీ విషయంలో మాత్రం సందేహాలు వ్యక్తంచేశారు.లగడపాటి చెప్పినట్లుగానే టీడీపీ విజయం సాధించింది.
నంద్యాల ఉప ఎన్నికలో పోటీ హోరాహోరీగా ఉంటుందని రాజకీయ పక్షాలు, విశ్లేషకులు, అధికారులు భావించారు. కానీ టీడీపీ 27,000 మెజారిటీతో గెలుపొందుతుందని లగడపాటి ముందుగానే చెప్పారు. ఆ సర్వే ప్రకారంగానే టీడీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

తెలంగాణలో పోటీకి లగడపాటి సై, పోలింగ్ తర్వాత సర్వే ఫలితాలు