KTR: కేవలం డైలాగులతో రైతుల ఆదాయం రెట్టింపు కాదు.. ప్రధాని మోడీ పై కేటీఆర్ ఫైర్
Kalvakuntla Taraka Rama Rao: రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను కూడా ఆదుకోవాలనీ, సరిగ్గా ఇదే తెలంగాణ చేసిందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు.
Telangana Assembly Elections 2023: భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ డైలాగులు, జుమ్లాలతో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదని అన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని వివరిస్తూ.. 'ట్రైల్‌బ్లేజర్ తెలంగాణ' పేరుతో ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమస్యలు ఉన్నప్పటికీ, దశాబ్దంలో రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధించిందనీ, ఇప్పుడు దేశంలోనే తలసరి ఆదాయంలో అత్యధికంగా ఉందని తెలిపారు.
స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని కూడా ఆయన హైలైట్ చేశారు. "రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం గురించి ప్రధాని మాట్లాడుతున్నారు. కేవలం డైలాగులతో రైతుల ఆదాయం రెట్టింపు కాదు. రైతుల ఆదాయం జుమ్లాలతో (గాలి వాగ్దానాలతో) రెట్టింపు కాదు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే వ్యవసాయం, అనుబంధ రంగాలను కూడా ఆదుకోవాలి. సరిగ్గా ఇదే తెలంగాణ చేసింది" అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కరువును అధిగమించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) రూ.1.70 లక్షల కోట్లతో కాళేశ్వరం, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారనీ, ఆ లక్ష్యంలో విజయం సాధించారని అన్నారు.
మేడ్డిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మంత్రి కేటీఆర్.. ప్రాజెక్టుల్లో ఇంజినీరింగ్ సమస్యలు తలెత్తుతున్నాయనీ, దౌలేశ్వరం బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ, నాగార్జునసాగర్, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం ప్రాజెక్టు సమస్యలను ఎత్తిచూపారు. రాష్ట్ర ఖజానాపై ఎలాంటి భారం పడకుండా మేడ్డిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులన్నీ చేపడతామని కాంట్రాక్టు ఏజెన్సీ ప్రకటించిందని వివరించారు. డిసెంబర్ 3 తర్వాత కూడా రాజకీయాలు కొనసాగుతాయనీ, అయితే ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయవద్దని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుదల గురించి మాట్టాడుతూ.. వరి ఉత్పత్తిలో తెలంగాణ 14వ స్థానంలో ఉండగా, నేడు పంజాబ్, హర్యానాలను అధిగమించిందన్నారు. 2014లో 131 లక్షల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి 268 లక్షల ఎకరాలకు పెరిగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.