Asianet News TeluguAsianet News Telugu

telangana elections 2023 : లేడీ ‘పుష్ప’ ఈ బర్రెలక్క బెదిరించినా తగ్గేదేల్యా...ఇంతకీ ఆమె ఎవరు?

బర్రెలక్క తమ్ముడిపై దాడి.. ఈ వార్త, దానికి సంబంధించిన వీడియోతో నిన్నటినుంచి సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అంత క్రేజ్ ఎందుకు? తెలంగాణ ఎన్నికల్లో అనివార్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన, గుర్తించాల్సిన పేరుగా బర్రెలక్క ఎలా మారింది? 

telangana elections 2023 : complete details about Barrelakka alias Sirisha - bsb
Author
First Published Nov 22, 2023, 10:46 AM IST

ఎన్నికలు అనగానే డబ్బు ప్రవాహం, హోదా, పలుకుబడి.. ఇవన్నీ ఉండాలి. వీటికితోడూ... చుట్టూ నమ్మకమైన మనుషులు, ఎదురిస్తే ఎంతటికైనా తెగించే తెగింపు ఉన్న అనుచరులు.. ఇవి ప్రజల్లో నాటుకుపోయిన భావాలు. వాస్తవం కూడా ఇలాగే ఉంది. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతోందో అమ్మాయి. నిండా పాతికేళ్లు ఉన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఓ ప్రభంజనం. ఆమె గెలుస్తుందా? లేదా? అనేది పక్కనపెడితే.. తన మాట తీరుతో, ఎంచుకుంటున్న పాయింట్లతో ప్రజల హృదయాల్ని గెలుచుకుంటోంది. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంటోంది. ఆ యువతే బర్రెలక్క అలియాస్ శిరీష.

కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా.. ఈల గుర్తుతో బరిలోకి దిగుతోంది శిరీష. ఎన్నికల ప్రచారంలో ఆమె చేస్తున్న ప్రసంగాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. నిరుద్యోగుల కోసమే తాను పోరాడతానని చెబుతోంది. తాను ఎందుకు బర్రెలు కాయాల్సి వచ్చిందో చెబుతుంది. నామినేషన్ వేసినప్పుడు తన వెనుక లేని పార్టీలు ఆ తరువాత తమతో చేరమని ఎలా అడుగుతున్నారో, నామినేషన్ వాపస్ తీసుకోవాలని ఎలా ఒత్తిడి చేశారో.. ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతోంది. 

శిరీష.. గతంలో ‘హాయ్ ఫ్రెండ్స్ బర్లగాయనికి వచ్చిన’ అని ఓ 30 సెకండ్ల వీడియో తీసింది. అందులో గవర్నమెంట్ జాబ్స్ కు నోటిఫికేషన్స్ రావడం లేదని. డిగ్రీలు డిగ్రీలు చదివితే మెమోలు వస్తున్నయ్, తప్ప జాబ్ లు వస్తలేవని చెప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అప్పుడే శిరీష కాస్తా బర్రెలక్కగా మారింది. ఈ వీడియో తీసినందుకు ఆమె మీద పోలీస్ కేసు నమోదయ్యింది. అందులో ప్రభుత్వాన్ని కానీ, రాజకీయనాయకులను కానీ విమర్శించలేదు. తిట్టలేదు. కానీ కేసులు పెట్టి, అమ్మాయి అని కూడా చూడకుండా బాగా ఇబ్బంది పెట్టారు. ఈ విషయాన్ని బర్రెలక్క తన ఎన్నికల ప్రచారంలో చెప్పింది.

Bandi Sanjay: దళిత బంధులో అవినీతి.. క‌మీష‌న్ లో కేసీఆర్ కు వాటా.. బండి సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

‘మా అమ్మకు ఆరోగ్యం బాగుండదు, నాకు ఇల్లు లేదు, ఆస్తులు లేవు. పెద్ద కొత్తపల్లిలో మజీదుకు ఎదురుగా చిన్న తడకల షాపు పెట్టుకుని బతుకుతున్నా. ఉద్యోగం రాకపోవడంతో మా అమ్మకు భారం అవ్వొద్దని నాలుగు బర్రెలు కొనుకున్నా. నా దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తో రీల్స్ చేసేదాన్ని. అలా మొదటిసారి 
హాయ్ ఫ్రెండ్స్ బర్ల గాయనికి వచ్చిన అని ఓ 30 సెకండ్ల వీడియో తీసిన.. దీనిమీద నామీద కేసు పెట్టారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా ఇబ్బందులు పెట్టారు. తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. ఉన్న బర్రెలు అమ్మి, ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వాలని హైదరాబాద్ కు వచ్చాను. మంచి కోచింగ్ సెంటర్ ల జాయిన్ అయిన. చాలా కష్టపడి చదివిన.  కానీ, ప్రతీ ఒక్క ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నరు. గ్రూప్1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇలా ప్రతీ ఎగ్జామ్ పేపర్లను అమ్ముకున్నరు.

జాబ్ వస్తదని అందరనుకున్నట్లే నేను అనుకున్నా.. సామాన్యురాలిగా వెడితే ఇబ్బంది పెడుతున్నరని.. రాజకీయాల్లోకి రావాలనుకున్నా.. నామినేషన్ కు కావాల్సి రూ.5వేలు కూడా అందరిదగ్గర తీసుకుని వేశా. నామినేషన్ సమయంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఆ తరువాతి రోజునుంచీ బెదిరింపులు మొదలయ్యాయి’అని చెప్పుకొచ్చింది. తాజాగా మంగళవారం బర్రెలక్క తమ్ముడిపై దాడి చేశారు. దీని మీద శిరీష ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఈ క్రమంలోనే అందరిలోనూ ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతోంది. శిరీషది నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం, మరికల్ గ్రామం. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. తండ్రి చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేశాడు. తల్లే పెద్ద దిక్కు. బాగా చదువుకుని పోలీస్ కావాలని శిరీష కోరిక. దీనికోసం గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యింది. కానీ కోరి, కొట్లాడి తెచ్చుకున తెలంగాణలో ఉద్యోగాలు రావడం లేదని, గ్రూప్స్ వాయిదా పడడం, పేపర్ లీక్ లతో విసిగిపోయి బర్రెలను కాస్తూ.. ఓ వీడియో చేసింది. 

ఆ తరువాతే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్రంగా బరిలోకి దిగింది బర్రెలక్క. ఆమె సాహసానికి, చిన్న వయసులో ఆమె చూపిస్తున్న మెచ్యూరిటీకి అందరూ ఫిదా అవుతున్నారు. లక్షలాది మంది ఆమెకు మద్దతు పలుకుతున్నారు. సోషల్ మీడియా అయితే ఓ రేంజ్ తో సపోర్ట్ చేస్తుంది. బహుజన సంఘాలు, కవులు, కళాకారులు, మేధావులు, నిరుద్యోగులు.. ఒక్కరని కాదు.. తెలంగాణలోని అన్ని వర్గాలనుంచీ భారీ ఎత్తున ఆమెకు మద్దతు లభిస్తుంది.

దీనికి మరో కారణం కొల్లాపూర్ లో వేళ్లూనుకుపోయిన దొరల పాలనకు ఓ పేద యువతి ఢీ కొట్టాలనుకోవడమే. ఇవెలమలు ఎక్కువగా ఉండే  కొల్లాపూర్లో ఇప్పటివరకు 11 సార్లు వారే ఎమ్మెల్యేలుగా గెలవడమే. ఆ తరువాత మరో రెండు సార్లు మరో అగ్రకులమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు గెలిచారు. మొట్ట మొదటి సారి వారికంటే తక్కువ సామాజిక వర్గానికి, పోల్చుకోవడానికి కూడా వీలుకాని నిమ్నఆర్థిక స్తాయికి చెందిన అమ్మాయి పోటీపడడం మింగుడు పడడం లేదు.

ఇప్పటికే శిరీషకు ఇన్ స్టాలో విపరీతంగా ఫాలోయింగ్ వచ్చింది. యూ ట్యూబ్ లో బర్రెలక్క క్రియేషన్స్ పేరుతో ఛానల్ ఉంది. వీటిలో ఏది పోస్ట్ చేసినా ఇప్పుడు వైరల్ అయిపోతోంది. ఆమె పాపులారిటీని చూసి మెల్లమెల్లగా ఆమెకు ఆర్థికంగా అండగా నిలబడడానికి ముందుకు వస్తున్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటానన్న ఆమె మాటలు అందర్నీ ఇష్టపడేలా చేస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష ప్రధాన పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దాడులూ, బెదిరింపులూ జరుగుతున్నాయి. ఏం చేసినా.. తగ్గేదే లే.. అంటోందీ లేడీ ‘పుష్ప’..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios