సారాంశం

Telangana Assembly Elections 2023: నరేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీ ప్రభుత్వమే రేషన్ కార్డుదారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోందని క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ అన్నారు. వచ్చే ఐదేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యంతో పాటు క్వింటాలు ధాన్యానికి రూ.3,100 కనీస మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. 

BJP general secretary Bandi Sanjay Kumar: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్ మ‌రోసారి భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. దళిత బంధు స్కీమ్ లబ్ధిదారుల నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వసూలు చేసే కమీషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వాటా పొందుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి కొందరు బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు కమీషన్లు వసూలు చేస్తున్నారని తనకు తెలుసునంటూ ఇదివ‌ర‌కు కేసీఆర్ వారి పార్టీ నాయ‌కుల‌ను హెచ్చ‌రిస్తూ చేసిన వ్యాఖ్యల‌ను బండి సంజ‌య్ మ‌రోసారి ప్రస్తావించారు.

"రెండుసార్లు బీఆర్‌ఎస్ కు ఓటేస్తే కేసీఆర్‌ మద్యం తాగి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే ఆ నిధులను దారి మళ్లించి పేద కుటుంబాలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు" అని కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో బండి సంజయ్ అన్నారు. అలాగే, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే అంశంపై గురించి కూడా ప్ర‌స్తావించారు. కేంద్రంపై ఊరికే ఆరోప‌ణ‌లు చేస్తున్నారని మండిప‌డ్డారు. మీటర్లు బిగించాలని నిర్ణయించుకున్నది కేసీఆర్, కానీ బీజేపీ ప్రభుత్వం హెచ్చరించడంతో వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు.

కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కేటాయిస్తామని ప్రగల్భాలు పలికి తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగ యువతను ప్రశ్నపత్రాల లీకేజీతో నిరుద్యోగ భృతి చెల్లించకుండా మోసం చేశార‌ని బండి సంజ‌య్ విమ‌ర్శించారు. 2బీహెచ్‌కే ఇళ్లను పంపిణీ చేయకపోవడం, నిరుద్యోగ భృతిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీ ప్రభుత్వమే రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ ఉచితంగా చేస్తోందన్నారు. వచ్చే ఐదేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యంతో పాటు క్వింటాలు ధాన్యానికి రూ.3,100 కనీస మద్దతు ధర ఇస్తుందని క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ అన్నారు.