telangana elections 2023 : ఖమ్మంలో అర్థరాత్రి హైడ్రామా.. పోలీస్ అధికారి ఇంట్లో నోట్ల కట్టల కలకలం..!
కాంగ్రెస్ వారే కావాలని ఇలా చేయించారని, 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తన ఇంటి మీద దాడికి వచ్చారని, దీని వెనక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారని మాజీ పోలీసు అధికారి ఆరోపించారు.
ఖమ్మం : ఖమ్మంలో మంగళవారం అర్ధరాత్రి నోట్ల కట్టలు కలకలం రేపాయి. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సుభాష్ చంద్రబోస్ ఇంట్లో భారీఎత్తున నోట్ల కట్టలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. 150 మంది దాకా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటి మీద ముట్టడికి ప్రయత్నించారు. బిఆర్ఎస్ కార్యకర్తలూ అక్కడికి చేరుకున్నారు. వీరితోపాటు ఎన్నికల అధికారులు, పోలీసులూ ఒకసారిగా సుభాష్ ఇంటికి చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనంతటికి కారణం సి విజిల్ కంప్లైంట్. సుభాష్ దగ్గర భారీగా అక్రమ నగదు ఉందని, ఆ నగదు అధికార పార్టీదే అని కాంగ్రెస్ సి విజిల్ కి కంప్లైంట్ ఇచ్చింది.
అప్పటికే సుభాష్ ఇంటికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ డబ్బు కాంగ్రెస్ నేతలదే అని ప్రత్యారోపణలు చేశారు. సుభాష్ ఇంట్లో తనిఖీలు నిర్వహించినప్పటికీ ఎలాంటి నగదు దొరకలేదు. కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఒట్టివేనని తేలడంతో సి విజిల్ అధికారులు వెళ్లిపోయారు. రిటైర్డ్ డిసిపి అయిన సుభాష్ చంద్రబోస్ ఈ ఘటనపై మండిపడ్డారు. కాంగ్రెస్ వారే కావాలని ఇలా చేయించారని చెప్పుకొచ్చారు. 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తన ఇంటి మీద దాడికి వచ్చారని దీని వెనక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారని ఆరోపించారు.
దీని మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని చెప్పుకొచ్చారు. ఒకవేళ తన దగ్గర అక్రమంగా నగదును దాచిపెట్టి ఉన్నట్లయితే చట్ట ప్రకారం వెళ్ళాలి. నేను బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగం చేసి రిటైర్ అయిన వ్యక్తినే, ఒక పౌరుడిని.. ఇలా దాడికి దిగడం అన్యాయం అంటూ విరుచుకుపడ్డారు.