Telangana Elections 2023: తెలంగాణ శాసనసభకు 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు పోలింగ్ జరుగుతుండగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. 

Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నిక‌ల పోలింగ్ ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. 9 గంట‌ల వ‌ర‌కు 7.78 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇక మెదక్ లో 9 శాతం, దుబ్బాకలో 10 శాతం, నర్సాపూర్ లో 9 శాతం, గజ్వెల్ లో 10 శాతం పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. 

మొత్తం 3.26 కోట్ల ఓట‌ర్లు.. 

రాష్ట్రంలో 1,63,13,268 మంది పురుషులు, 1,63,02,261 మంది మహిళా ఓటర్లు సహా 3.26 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఆయన కుమారుడు మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (కేటీఆర్), రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి, బీజేపీ లోక్‌సభ సభ్యులు బండి సంజయ్ కుమార్, డీ అరవింద్ సహా 2,290 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. అక్టోబర్ 9న ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించడంతో రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది.

మూడు పార్టీల మ‌ధ్యే పోరు.. 

బీఆర్‌ఎస్ మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం 111, నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సీపీఐకి ఒక సీటు ఇవ్వగా, మరో 118 స్థానాల్లో పోటీ చేస్తోంది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం నగరంలోని తొమ్మిది సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలబెట్టింది. అసెంబ్లీ ఎన్నికల కోసం 2.5 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉంటారని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.