Asianet News TeluguAsianet News Telugu

టెన్త్ పేపర్ లీక్ .. దొంగలను లోపలేశాం, పరీక్షలు ప్రశాంతం : మంత్రి సబిత వ్యాఖ్యలు

పదో తరగతి పేపర్ లీక్ వెనుక వున్న దొంగలను లోపల వేయడంతో తర్వాత రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.  పదో తరగతి పరీక్షలను బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆమె ఆరోపించారు. 

telangana education minister sabitha indra reddy comments on 10th class paper leak case ksp
Author
First Published Apr 7, 2023, 6:06 PM IST

బీజేపీపై మండిపడ్డారు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. శుక్రవారం ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలను బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకుంటోందన్నారు. పేపర్ ను వాట్సాప్‌లో సర్క్యూలేట్ చేశారని మంత్రి ఆరోపించారు. పేపర్ లీక్ వెనుక వున్న దొంగలను లోపలేస్తే తర్వాతి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు. పేపర్ లీక్ వల్ల పిల్లలు, వారి తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురయ్యారని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక, పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. మంగళవారం రాత్రి బండి సంజయ్‌ను కరీంనగర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి బొమ్మలరామారం  పోలీసు స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్‌ను బుధవారం బొమ్మలరామారం  నుంచి వరంగల్‌కు తరలించారు. ఆయనను బుధవారం సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సంజయ్‌ను నిన్న రాత్రి కరీంనగర్ జైలుకు తరలించారు. ఇక, ఈ కేసులో బండి సంజయ్‌ను ఏ-1గా పేర్కొన్న పోలీసులు.. ఆయనపై ప్రధాన కుట్రదారు అని అభియోగం మోపారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి బండి సంజయ్‌కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. 

Also Read: లీక్ చేసిన దొంగలంతా జైల్లోనే.. అందుకే ఇవాళ పరీక్షలు ప్రశాంతం : బండి సంజయ్‌పై హరీశ్‌రావు పరోక్ష వ్యాఖ్యలు

కాగా.. పేపర్ లీక్ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ చేసిన దొంగలంతా జైల్లో వుండటంతో ఇవాళ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని చురకలంటించారు. బీఆర్ఎస్ పార్టీ పిల్లలకి ఉచితంగా చదువు చెబితే.. బీజేపీ మాత్రం పేపర్లు లీక్ చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ గొడవలు పెట్టాలని చూస్తోందని ఆయన విమర్శించారు. బండి సంజయ్ సమాధులు తవ్వుతా అంటే.. రేవంత్ రెడ్డి కూలగొడతా, కాలుపెడతానని అంటున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు తెలంగాణకు అవసరమా అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీది దేశభక్తి కాదని.. కపట మొక్కులని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీపై కేసు వేసినా సోనియా గాంధీని తిట్టినా కాంగ్రెస్ ఏం చేయలేకపోయిందని హరీశ్ రావు పేర్కొన్నారు. 

ఎయిమ్స్‌లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజ్ వస్తే మోడీ ఇప్పుడు కొబ్బరికాయ కొడతారా అంటూ హరీశ్ రావు చురకలంటించారు. మోడీ వస్తున్నారని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. ఒక్క మెడికల్ కాలేజీకే ఇంత చేస్తే, తమ ప్రభుత్వం ఒకేసారి 8 మెడికల్ కాలేజీలకు కొబ్బరికాయ కొట్టిందన్నారు. బీజేపీది పని తక్కువ, ప్రచారం ఎక్కువన్నారు. తమది చేతల ప్రభుత్వమని.. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో చేయని పనులను కేసీఆర్ 8 ఏళ్లలోనే పూర్తి చేశారని హరీశ్ రావు ప్రశంసించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios