Assembly Election: త్వరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించి అధికారపీఠం దక్కించుకోవాలని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.
Telangana Assembly Election: తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రానున్న ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ, ఇతర పార్టీలను ఇరుకున పెట్టే విధంగా ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు ప్రణాళికలు రచిస్తున్నాయి. మరోసారి అధికారపీఠం దక్కించుకోవాలని అధికారపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సైతం ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 6లోగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయకుంటే లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్ర అసెంబ్లీ రద్దు ప్రకటనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమీక్షిస్తోంది. ముందస్తు పోల్‌పై పార్టీ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఆగస్టులోగా తుది నివేదికను సమర్పించాలని టీఆర్‌ఎస్ ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిషోర్‌ను కోరినట్టు సమాచారం. తమకు కలిసివచ్చిన ముందస్తు ఎన్నికలవైపు టీఆర్ఎస్ మొగ్గుచూపుతున్నదని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనిపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. సంక్షేమ పథకాలు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు, కొత్త రేషన్‌కార్డుల జారీ, పింఛన్‌ల విడుదల వేగవంతం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం దీనికి అనుగుణంగా ఆయా శాఖలను నజర్ పెట్టారు. సెప్టెంబరు 6లోగా రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయకుంటే సాధారణ లోక్‌సభ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి.
ఒకవేళ అసెంబ్లీని రద్దు చేస్తే కర్ణాటక, గుజరాత్ ఎన్నికలతో పాటు ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాగైనా ముందస్తు ఎన్నికల వైపే మొగ్గుచూపుతున్నారనే అంచనాల నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు దూకుడును పెంచాయి. అధికార పార్టీ ముందస్తుకు వెళ్తే అందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొంటున్నాయి. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార పార్టీ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు సైతం క్రమంగా పెంచుతున్నాయి. ఉండేవారు ఉంటారు.. పోయేవాళ్లు పోతారు.. అలాంటి వారితో పార్టీకి పెద్దగా జరిగే నష్టం లేదని గులాబీ దళం పేర్కొంటోంది. ఈ క్రమంలోనే అన్ని ప్రధాని పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు దూకుడును పెంచాయి. ఏ చిన్న అవకాశం దొరికినా అధికార టీఆర్ఎస్ పై విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. అయితే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీని సాధిస్తామని గులాబీ పార్టీ ధీమాగా ఉంది. రానున్న ఎన్నికల్లో సత్తా చాటుతామని కాంగ్రెస్ పేర్కొంటోంది. త్వరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెక్ పెడుతూ.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత ప్రధాన పార్టీల దూకుడు గమనిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదని తెలుస్తోంది. అయితే, ముందస్తుకు వెళ్తే టీఆర్ఎస్ కు కలిసివచ్చే అవకాశాలున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
