కరీంనగర్: కరోనా సోకిన తెలంగాణ వాసికి దుబాయ్‌లోని ఓ ఆసుపత్రి రూ. 1.52 కోట్లను మాఫీ చేసింది. అంతేకాదు అతను తన స్వగ్రామం చేరుకోవడానికి సహాయం కూడ చేసింది. ఆసుపత్రి చూపిన ఉదారతకు బాధితుడు ధన్యవాదాలు తెలిపాడు. 

also read:సిద్దిపేట ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం: ఐసీయూలోనే కరోనా రోగి డెడ్‌బాడీ

జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం వెనుగుమట్లకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి ఉపాధి కోసం దుబాయ్ కి వెళ్లాడు. దుబాయ్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన ఆయన అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని స్థానికంగా ఉన్న గల్ఫ్  కార్మికుల రక్షణ సంఘం ప్రతినిధులు ఆసుపత్రిలో చేర్పించాడు.

దుబాయ్ లోని ఆల్ ఖలీజా రోడ్డులోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి సిబ్బంది అతడిని పరీక్షించారు. దీంతో ఆయనకు కరోనా సోకిందని తేలింది. 80 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఆయన చికిత్స పొందారు. ఆసుపత్రి యాజమాన్యం ఆయనకు రూ. 1.52 కోట్లు బిల్లు వేసింది. 

అయితే అంత డబ్బు చెల్లించడం తనకు సాధ్యం కాదని బాధితుడు ఆసుపత్రి యాజమాన్యానికి తేల్చి చెప్పాడు. దీంతో గల్ఫ్ కార్మికుల రక్షణ సంఘం ప్రతినిధులు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ వాలంటరీ సుమంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వీరంతా కలిసి  దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ పనిచేస్తున్న రాయబారి హర్జిత్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు.

భారత రాయబారి ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ రాశాడు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. ఆసుపత్రి బిల్లు మొత్తాన్ని మాఫీ చేసింది. అంతేకాదు బాధితుడు  స్వగ్రామానికి వచ్చేందుకు అవసరమైన సహాయాన్ని కూడ ఆసుపత్రి యాజమాన్యం చేసింది. 

హైద్రాబాద్ వచ్చేందుకు వీలుగా ఆశోక్ ఉచితంగా ఫ్లైట్ టిక్కెట్టు ఇప్పించాడు. ఆయనకు తోడుగా కనకయ్య అనే వ్యక్తిని ఇచ్చి పంపాడు. ఖర్చుల కోసం రూ. 10 వేలు కూడ ఇచ్చారు. మంగళవారం నాడు బాధితుడు శంషాబాద్ కు చేరుకొన్నాడు. అక్కడి నుండి జగిత్యాల జిల్లాలోని తన స్వంత గ్రామంలో హోం క్వారంటైన్‌లో ఉంటున్నాడు.