Asianet News TeluguAsianet News Telugu

కోల్డ్ స్టోరేజీకి తెలంగాణ డిఎస్సీ ?

  • మళ్లీ మాట తప్పిన తెలంగాణ సర్కారు
  • ఈ ఏడాది కూడా అనుమానంగానే డిఎస్సీ
  • మానసిక క్షోభ అనుభవిస్తున్న నిరుద్యోగుులు
  • వివాదాలను సర్కారే తెస్తోందంటున్న అభ్యర్థులు
  • సంగారెడ్డి జిల్లాలో టీచర్ అభ్యర్థి ఆత్మహత్య
telangana dsc will going to cold storage

తెలంగాణ సర్కారు మళ్లీ మాట తప్పింది. టెట్ రిజల్ట్స్ వచ్చిన రోజే డిఎస్సీ ప్రకటిస్తామని స్వయంగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. కానీ ఆచరణలో సర్కారు ఫెయిల్ అయింది. మంత్రి మాట తప్పారు. టెట్ పలితాలు వచ్చాయి. కానీ డిఎస్సీ మాత్రం రాలేదు. ఎందుకు సర్కారు ఇంతగా నిరుద్యోగుల జీవితాలతో దాగుడుమూతలు ఆడుతున్నది. ఇంతకూ అసలు డిఎస్సీ వేస్తారా? లేక డిఎస్సీని కోల్డ్ స్టోరేజీకి నెట్టేస్తారా?

తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రకటనలు, ఆచరణలో అలసత్వం కారణంగా నిరుద్యోగుల ఆశలు ఆవిరైపోతున్నాయి. తాజా పరిణామాలు చూస్తే ఈ ఏడాది అసలు డిఎస్సీ వేస్తారా వేయరా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రకరకాల కారణాలు చూపి డిఎస్సీని కోల్డ్ స్టోరేజీకి నెట్టేస్తున్నారా అన్న చర్చ నిరుద్యోగ యువతలో సాగుతున్నది. పరిణామాలు చూస్తుంటే తెలంగాణ సర్కారు ఈ ఏడాది డిఎస్సీ నిర్వహణపై చేతులెత్తేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

డిఎస్సీ విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో లేని సమస్యలు, ఇబ్బందులను తెలంగాణ సర్కారు తెరమీదకు తెస్తోంది. పాలనాసౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు తీసుకొచ్చినా ఆ కొత్త జిల్లాలు టీచర్ అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతున్నాయి. కొత్త జిల్లాలు నేడు డిఎస్సీకి గుదిబండగా మారుతున్నాయి. దానికితోడు ఖాళీల సంఖ్య తేలకపోవడం, స్కూళ్ల మూసివేత, రేషనలైజేషన్ నెపం ఇలా రకరకాల కారణాలను చూపి డిఎస్సీ ని మరింత ఆలస్యం చేసే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు కనబడుతున్నది.

అందుకోసమే ముందుగా పాత జిల్లాల ఆధారంగా డిఎస్సీ అన్నారు. తర్వాత మాట మార్చి కొత్త జిల్లాల ఆధారంగా డిఎస్సీ జరుపుతామని మంత్రి కడియం స్వయంగా ప్రకటించారు. దీనిపై నిరుద్యోగుల్లో ఆందోళన, ఆగ్రహం నెలకొన్నాయి. ఏదో ఒకటి తేల్చకుండా నాన్చివేత వైఖరి అవలంభించడం పట్ల నిరుద్యోగులు రగిలిపోతున్నారు. చిన్న చిన్న కారణాలను బూతద్దలంలో చూపుతూ సర్కారు పెద్దలు కాలయాపన చేస్తున్నారని అభ్యర్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ పరమైన చిక్కులు ఉన్నాయంటూ ఈ ఏడాది కూడా డిఎస్సీ వాయిదా వేసి కోల్డ్ స్టోరేజీలో పడేస్తారా అన్న అనుమానాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి.

ఒకవైపు సుప్రీంకోర్టు తీవ్రమైన భాషలో సర్కారు వైఖరిని ఎండగట్టింది. డిఎస్సీ వేయకుండా ఎందుకు నాన్చుతున్నారని నిలదీసింది. మాండమస్ గా పరిగణిస్తాం అని కూడా కామెంట్ చేసింది. అయినా సర్కారులో ఏమాత్రం చలనం రావడంలేదు. కొత్త జిల్లాల సాకు, జోన్ల సాకు చూపుతూ టైంపాస్ చేస్తోంది సర్కారు. ఇక తాజా పరిణామాలు చూస్తుంటే ఇప్పట్లో ప్రకటన వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. ఎందుకంటే గత నెల రోజులుగా సర్కారు డిఎస్సీపై చూపిన చొరవ నామమాత్రంగానే ఉంది. ఖాళీలను కూడ కలుపుకుని పోస్టుల సంఖ్య పెంచుతామన్న ఒక లీక్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగుల్లో అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ స్పష్టమైన విధానం ఇంకా ప్రకటించడంలేదు సర్కారు. పలుమార్లు ఉన్నతాధికారులు సమావేశమైనా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం చూస్తే మరో ఏడాది కూడా డిఎస్సీపై సర్కారు వెనక్కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక సుప్రీంకోర్టు సర్కారు మెడమీద కత్తి పెట్టిన పరిస్థితి ఉంది. అయితే గురుకులాల నియామకాలను చూపించి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దానికితోడు కొత్త జిల్లాల చిచ్చును సర్కారు వారే ఉద్దేశపూర్వకంగా ముందుకు తెచ్చినట్లు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టులో మరోసారి ఈ సాంకేతిక అంశాలను చూపి ఈ ఏడాది కూడా నో డిఎస్సీ అని చెప్పే ప్రమాదం ఉందని అభ్యర్థులు చెబుతున్నారు.

ఇక ఈనెల 27వ తేదీనాటికి డిఎస్సీ లేక ఐదేళ్లు గడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రమైన అలజడి, ఆందోళన కారణంగా రెండేళ్లపాటు డిఎస్సీ జరపలేదు. అయితే తెలంగాణ రాగానే వరుస నోటిఫికేషన్లు వస్తాయని భావించిన టీచర్ అభ్యర్థులకు మూడేళ్లపాటు మొండిచేయి చూపింది సర్కారు. చివరి డిఎస్సీ  పరీక్ష రాసి ఐదేళ్లవుతున్న తరుణంలో ఇంకెన్ని రోజులకు మళ్లీ పరీక్ష రాస్తామో అని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

ఇంకోవైపు డిఎస్సీ కోసం ఎదురుచూసి ఎదురుచూసి అభ్యర్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఆందోళనతో ఒక అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన చావుకు తెలంగాణ సర్కారు నిర్లక్ష్య వైఖరే కారణమని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిరుద్యోగుల ఆందోళనను గుర్తించాలని సర్కారును కోరుతున్నారు నిరుద్యోగ సంఘాల నేతలు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios