నిరుద్యోగులకు శుభవార్త:'జాబ్ క్యాలెండర్‌పై కార్యాచరణ'
జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో తమ ప్రభుత్వం కార్యాచరణను సిద్దం చేస్తుంది.జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియను ప్రారంభించినట్టుగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.మెగా డీఎస్‌సీని కూడ నిర్వహించనున్నట్టుగా మల్లు భట్టి విక్రమార్క వివరించారు. దాదాపు 15 వేల మంది కానిస్టేబుల్ పోస్టులను రిక్రూట్ మెంట్ చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. గ్రూప్-1 నోటిఫికేషన్ లో తాజాగా 64 పోస్టులను పెంచినట్టుగా మంత్రి గుర్తు చేశారు. గతంలోనే 500 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. యూపీఎస్‌సీ తరహాలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేసింది.ఈ విషయమై అధికారుల బృందం కూడ అధ్యయనం చేసింది.ఈ బృందం ప్రభుత్వానికి నివేదికను అందించింది.
also read:తెలంగాణ బడ్జెట్: రూ. 2 లక్షల పంట రుణమాఫీ, రైతు భరోసాపై కీలక ప్రకటన
మరో వైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మెన్ గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లను కేటాయించింది. ఈ విషయాన్ని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో గుర్తు చేశారు.
భారత రాష్ట్ర సమితి రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన కొన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. అయితే ఈ విషయమై అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వంద మందికిపైగా నిందితులను అరెస్ట్ చేశారు.
ఆ సమయంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటామని హామీ ఇచ్చింది. టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కూడ ప్రకటించింది. ఈ దిశగానే కార్యాచరణను ప్రకటిస్తామని బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.