మా హామీలకు వారంటీ ఉందా లేదా?:బీఆర్ఎస్‌ను ప్రశ్నించిన భట్టి
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు ఇవాళ మీడియాతో మాట్లాడారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చారు ముగ్గురు మంత్రులు.
ఖమ్మం:ప్రజల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
ఆదివారంనాడు ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మల్లు భట్టి విక్రమార్క, జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం జిల్లాకు వచ్చారు.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముగ్గురు మంత్రులకు ఘనంగా స్వాగతం పలికారు.
సంపద సృష్టించి ప్రజలకు పంచడమే తమ ప్రభుత్వం ప్రధానమైన ఏజెండాగా ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. వంద రోజుల్లో మిగతా నాలుగు గ్యారంటీలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజా ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ ప్రతి సంస్థ ప్రజల కోసం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం పూర్తిగా ప్రజల కోసం పనిచేస్తుందన్నారు.మహిళా సాధికారతకు తొలి అడుగుగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉచిత ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతూ అందించే గ్యారెంటీని ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలకు వారంటీ లేదని ఎద్దేవా చేసిన బిఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టు లాగా బాధ్యత తీసుకున్న రెండు రోజుల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు హామీలను అమలు చేసిన విషయాన్ని ఆయన వివరించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇండ్ల సమస్య, పోడు ల్యాండ్స్, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.