పక్కాగా చేప మందు పంపిణీ : తెలంగాణ సర్కారు

First Published 27, May 2018, 12:11 PM IST
telangana CS sk joshi review on fish medicine
Highlights

భారీగా ఏర్పాట్లు

జూన్ 8 వ తేదిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పంపిణీ చేసే ఉచిత చేపప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని చర్యలు చేపట్టాలని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సి.యస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ చేపప్రసాదానికై వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్ధాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. చేప ప్రసాదం కోసం నగరం నుండే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి సైతం ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రజల కోసం ప్రత్యేకంగా ఆర్టీసి బస్సులను నడపనున్నట్లు అధికారులు సి.యస్ కు వివరించారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి మత్స్య శాఖ నుండి అవసరమైన చేప పిల్లలను సరఫరా చేయనున్నట్లు ఆ శాఖ అధికారులు వివరించారు. చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజల కోసం ఎక్కువ సంఖ్యలో కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.

ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారు క్యూలైన్లలో వెళ్ళేందుకు భారికేడ్లను ఏర్పాటు చేయాలని, గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మార్పులు చేర్పులతో పాటు వాటర్, వెదర్ ఫ్రూప్ ఏర్పాట్లు చేయాలని సి.యస్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకై  అవసరమైన సి.సి.కెమరాలను ఏర్పాటు చేయాలన్నారు.

 

 

 

త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో కౌంటర్లను ఏర్పాటు చేసి మంచినీటిని సరఫరా చేయాలన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దాని పరిసర ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని జిహెచ్ఎంసి అధికారులను సి.యస్ ఆదేశించారు. ప్రజల అవసరాలకనుగుణంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మొబైల్ టాయిలేట్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. చేపప్రసాదం కోసం వచ్చే ప్రజలకు వైద్య సదుపాయం కోసం అంబులెన్సులను అందుబాటులో ఉండేలా చూడాలని అవసరమైన మేరకు హెల్త్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక శాఖ అధ్వర్యంలో ఫైర్ టెండర్స్ ఏర్పాటు చేయాలన్నారు.

 

ఈ సమావేశంలో ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా, మత్స్యశాఖ కమీషనర్ సువర్ణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా, నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ఫైర్ సర్వీసెస్ డిజి గోపి క్రిష్ణ, జిహెచ్ ఎంసి అడిషనల్ కమీషనర్ భారతి హోళికేరి, బత్తిన హరినాధ్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

loader