హైదరాబాద్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై కసరత్తు

telangana cs review on double bedroom houses
Highlights

హైదరాబాద్ జనాలకు తీపి వార్త

జి.హెచ్.యం.సి పరిధిలో నిర్మించే డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలో ఏర్పాటు చేయవలసిన మౌళిక సదుపాయాల కల్పనకు సంబంధిత శాఖలు వారం లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జి.హెచ్.యం.సి  కమీషనర్ బి.జనార్ధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా, హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు అంజనీకుమార్, జి.హెచ్.యం.సి అదనపు కమీషనర్ భారతి హోళికేరి, డిజి ఫైర్ సర్వీస్ గోపి కృష్ణ, స్పోర్ట్స్ యం.డి దినకర్ బాబు, సోనుబాలాదేవి లతో పాటు విద్యుత్, హెచ్.ఎం.డి.ఏ, మెట్రోవాటర్ వర్క్స్,  ఆర్.టి.సి తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ జి.హెచ్.యం.సి ద్వారా 109 ప్రదేశాలలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఈ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై సంబంధిత శాఖలు అంచనాలు తయారుచేసి సమర్పించాలన్నారు. కొత్త కాలనీలలో టౌన్ ప్లానింగ్ నిబంధనల మేరకు ప్రతిపాదనలు ఉండాలన్నారు. డబుల్ బెడ్ రూం కాలనీలకు సంబంధించి హైదరాబాద్, సైబారాబాద్, పోలీసు కమీషనరేట్ పరిధిలో, ముఖ్యప్రాంతాలలో ఏర్పాటు చేయవలసిన పోలీసు స్టేషన్లపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. బ్యాంకులు, ఏటియంలకు సంబంధించి SLBC కి ప్రతిపాదనలు పంపాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా  కవర్   అయ్యే కాలనీలతో మిగతా వాటి వివరాలు రూపొందించాలన్నారు. వివిధ కాలనీలో ఇండ్ల నిర్మాణాల వివరాలను సంబంధిత శాఖలకు ఇవ్వాలన్నారు. నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలలో అధికారులు ప్రత్యక్షంగా పర్యటించి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. కాలనీల వారిగా, ప్రాంతాల వారిగా ప్రతిపాదనలు ఉండాలన్నారు. ఈ ఇండ్లకు మంచినీరు, డ్రైనేజి, విద్యుత్, పోలీస్ స్టేషన్లు, ఫైర్ స్టేషన్లు, మార్కెట్స్, కమ్యూనిటీ హాల్స్, బ్యాంకులు, ఏటియంలు, హెల్త్ సెంటర్లు, విద్యాసంస్ధలు, ఇంటర్ నెట్ కనెక్టివిటి, క్రీడా సౌకర్యాలు, అంగన్ వాడి సెంటర్లు, క్రియేషన్ సెంటర్లు తదితర సౌకర్యాల కోసం సంబంధిత శాఖలు నిబంధనల ప్రకారం అవసరమైన  ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పూర్తికి షెడ్యూల్డుననుసరించి సౌకర్యాలు కల్పించాలన్నారు. లక్ష్యాలమేరకు ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సి.యస్ ఆదేశించారు.

loader