సమైక్యత అంటే ఏంటీ .. తెలంగాణ విలీనోత్సవాలు ఎందుకు జరపరు : కేసీఆర్‌పై కూనంనేని విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు . తెలంగాణ విలీనోత్సవాలు జరిపేందుకు కేసీఆర్ ఎందుకు వెనుకాడుతున్నారని కూనంనేని నిలదీశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సమైక్యత అంటే ఎంటో కేసీఆర్ చెప్పాలని చురకలంటించారు. కేసీఆర్, ఎంఐఎం మధ్యలో వున్న సమైక్యతనా అని ఆయన ప్రశ్నించారు. సమైక్యత కాదు, విమోచనం కాదు ఇది నిజమైన విలీనమన్నారు. తెలంగాణ విలీనోత్సవాలు జరిపేందుకు కేసీఆర్ ఎందుకు వెనుకాడుతున్నారని కూనంనేని నిలదీశారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదన్నారు. చరిత్రను బీజేపీ వక్రీకరించి చూపిస్తోందని కూనంనేని దుయ్యబట్టారు. మజ్లిస్‌తో వున్న సమైక్యత వల్లే సమైక్యతా దినమని అంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. మజ్లిస్ లేకుంటే రాష్ట్రాన్ని పాలించలేమని కేసీఆర్ భావిస్తున్నట్లుగా వున్నారని సాంబశివరావు ఎద్దేవా చేశారు. దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలడమే ప్రధాని ధ్యేయమన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని కూలదోస్తున్నారని కూనంనేని ఆరోపించారు.
ALso Read: Telangana Liberation Day 2023: అభివృద్ధికి రోల్ మోడల్ తెలంగాణ: సీఎం కేసీఆర్
అంతకుముందు తెలంగాణ ప్రజల ఐక్యత వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందిందనీ, దేశంలో అతి పిన్న వయస్కుడైన తెలంగాణను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు. అభ్యుదయ వ్యతిరేక శక్తులు అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో ప్రగతి చక్రాలు ఆగడం లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. 17 సెప్టెంబర్ 1948న అప్పటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన రోజు 'జాతీయ సమైక్యతా దినోత్సవం'లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో భాగమైన సందర్భాన్ని 'జాతీయ సమైక్యతా దినోత్సవం'గా జరుపుకోవడం సముచితమని తెలంగాణ ప్రభుత్వం భావించిందన్నారు. మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దార్శనికత, తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ పదును, చాకచక్యం, ఎందరో నాయకుల కృషి వల్ల దేశం ఐక్యమైందని సీఎం పునరుద్ఘాటించారు. తెలంగాణ శరవేగంగా సాధిస్తున్న ప్రగతి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందని కుటుంబం మరొకటి లేదన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచిందనీ, తమ ప్రభుత్వ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు.