తెలంగాణలో కరోనా రోజురోజుకూ మహమ్మారిలా విరుచుకుపడుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తూ భయపెడుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,22,143 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 5,926 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,61,359కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో 18 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,856 కి చేరింది. 

కరోనా బారినుంచి నిన్న ఒక్కరోజే 2,209మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 3,16,656కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42, 853 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న 793 కేసులు నమోదయ్యాయి. 

కరోనా ఎఫెక్ట్: భారత్ పర్యటనకు దూరంగా ఉండాలని యూఎస్ వార్నింగ్...

ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆదివారం సీఎం కేసీఆర్ కి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ గా వచ్చినట్లు తేలింది. స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని.. కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు తెలిపారు. 

యాంటిజెన్ టెస్టు చేయగా కరోనా సోకినట్లు తేలిందన్నారు. ప్రస్తుతం కేసీఆర్ హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కాగా.. కేసీఆర్ కి కరోనా రావడం పై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. కేసీఆర్.. ఈ కరోనా మహహ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆంకాంక్షించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ అని చంద్రబాబు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.