వచ్చే నెల 10న కీలకమైన బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న తెలంగాణ కాంగ్రెస్
వచ్చే నెల 10వ తేదీన కాంగ్రెస్ షాద్ నగర్ బహిరంగ సభ నిర్వహించనుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చీఫ్ గెస్టుగా హాజరుకాబోతున్న ఈ సభలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ జోష్ మీద ఉన్నది. వరుస సభలు, సమావేశాలతో దూసుకుపోతున్నది. బడా నేతల చేరికలు, డిక్లరేషన్లు, గ్యారంటీ కార్డులు ఇలా ముందుకు సాగుతున్నది. ఇటీవలే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో భారీ సభను విజయవంతంగా నిర్వహించింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ కాంగ్రెస్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ ప్రయాణంలో తెలంగాణ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసుకుంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అంశం కీలకంగా ఉన్నది. బీసీ సీట్లు, బీసీ ఓట్ల గురించి ఇప్పటికే ఆ సామాజిక వర్గం సభలు, చర్చలు చేపడుతున్నది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ దాని కీలకమైన బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించడానికి సిద్ధమైంది. వచ్చే నెల 10వ తేదీన షాద్‌నగర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరుకానున్నారు.
ఈ సభలో బీసీలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను చర్చించనుంది. బీసీ సబ్ ప్లాన్, కుల గణన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలు, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై సభలో చర్చించనున్నట్టు తెలుస్తున్నది. వచ్చే నెలలో తొలి వారంలోనే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నట్టు వార్తలు వచ్చాయి.