సారాంశం
జనసేన పవన్ కల్యాణ్ మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు రంగం సిద్దమైంది. నాలుగో విడత వారాహి విజయ యాత్రను పవన్ కల్యాణ్ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు.
జనసేన పవన్ కల్యాణ్ మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు రంగం సిద్దమైంది. నాలుగో విడత వారాహి విజయ యాత్రను పవన్ కల్యాణ్ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా ఖరారు అయింది. అయితే టీడీపీ, జనసేనల పొత్తు ప్రకటన తర్వాత పవన్ జనాల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో ఈ సారి పవన్ వారాహి యాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ తన ప్రసంగాలలో ఏం చెప్పనున్నారు?, జనసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇస్తారా? అధికార వైసీపీపై ఏ విధమైన కామెంట్స్ చేయనున్నారు?, టీడీపీ శ్రేణులు కూడా పవన్ యాత్రకు హాజరవుతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు పవన్ యాత్రకు పోలీసుల అనుమతి ఉంటుందా?, ఏవైనా ఆంక్షలు విధిస్తారా? అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నాలుగో విడత వారాహి విజయ యాత్ర విషయానికి వస్తే.. కృష్ణా జిల్లాలో యాత్ర సాగనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో నాలుగో విడత వారాహి విజయ యాత్రను పవన్ ప్రారంభించనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళిక సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ యాత్రకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను తదుపరి సమావేశంలో ఖరారు చేయాలని నిర్ణయించారు.