Asianet News TeluguAsianet News Telugu

TPCC : సీతక్క ... తెలంగాణ కాంగ్రెస్ కు పెద్దక్క?

తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతల నుండి రేవంత్ రెడ్డిని తప్పించి కొత్తవారిని నియమించే ఆలోచనలో అదిష్టానం వుందన్నది ప్రచారం. ఇప్పటికే ఈ పదవిని ఆశిస్తున్నారంటూ కొందరు సీనియర్ల పేర్లు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఓ మహిళా నాయకురాలి పేరు తెరపైకి వచ్చింది.... 

Telangana Congress Party president chance for Seethakka?  AKP
Author
First Published May 25, 2024, 1:55 PM IST

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసాయి. దీంతో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అదిష్టానం ఇచ్చి టాస్క్ ముగిసిందట. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం... లోక్ సభ ఎన్నికల్లో అధిక సీట్లు కాంగ్రెస్ కు తెచ్చిపెట్టే బాధ్యతలను రేవంత్ రెడ్డిపై అదిష్టానం పెట్టిందని పొలిటికల్ సర్కిల్ టాక్. ఆ రెండు ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష (టిపిసిసి) బాధ్యతలను మరొకరికి అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ ను తప్పించి కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కొందరు సీనియర్లు పిసిసి పదవిని ఆశిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మరోలా వున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపైనే కాదు పార్టీపైనా పట్టు వుంచుకోవాలని... అందువల్లే కాంగ్రెస్ సీనియర్లకు రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించేందుకు సిద్దంగా లేరట. మరి ఆయన ఛాయిస్ ఎవరంటే... తనకు సన్నిహితురాలు, సోదరిలా భావించే ధనసరి అనసూయ (సీతక్క) కు పిసిసి పగ్గాలు అప్పగించాలని రేవంత్ చూస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అదిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాల్లో వున్నట్లు తెలుస్తోంది. 

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ పిసిసి అధ్యక్ష మార్పు వుంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్ సభ ఎన్నికల్లోనే కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించిందంటే రేవంత్ మాట కాదనేవారు వుండరు. అప్పుడు సీనియర్లను సైతం పక్కనబెట్టి తనకు నచ్చినవారికి పిసిసి బాధ్యతలు ఇప్పించుకోగలరు రేవంత్. ఒకవేళ ఆశించిన స్థాయిలో లోక్ సభ స్థానాలు కాంగ్రెస్ కు రాలేవో... అదిష్టానం వద్ద రేవంత్ పరపతి తగ్గుతుంది. అప్పుడు తెలంగాణ పిసిసి చీఫ్ ఎంపిక డిల్లీ పెద్దల చేతుల్లోకి వెళుతుంది. 

ఇప్పటికయితే పిసిసి అధ్యక్షురాలిగా సీతక్కకు బాధ్యతలు అప్పగించాలనేది సీఎం రేవంత్ వాదనగా  తెలుస్తోంది. ఇప్పటికే అదిష్టానం కూడా తెలంగాణలో కొత్త పిసిసి ఎంపిక ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. సౌమ్యురాలు, ప్రజల్లో మంచి ఫాలోయింగ్ వున్న నాయకురాలు, అన్నింటికి మించి పార్టీ కోసం కష్టపడే నాయకురాలు సీతక్కను పిసిసి రేసులో నిలిపితే ఆ పదవికోసం పోటీపడేవాళ్లు కూడా సహకరిస్తారన్నది రేవంత్ ఎత్తుగడగా కనిపిస్తోంది. కాబట్టి తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి సీతక్క పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల సమాచారం. 

సీతక్కే రేవంత్ ఛాయిస్ :

ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సీతక్కను నియమిస్తే మంత్రివర్గంలో కొనసాగించడం అనుమానమే. పార్టీ బాధ్యతలు, మంత్రి పదవి ఒక్కరికే కేటాయిస్తే మిగతా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలుంటాయి. కాబట్టి సీతక్కకు పిసిసి బాధ్యతలు అప్పగిస్తే మంత్రివర్గం నుండి తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వవచ్చు. ఏదేమైనా    తనకు అనుకూలంగా వుండేవారికే సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ బాధ్యతలు అప్పగించవచ్చు. 

టిపిసిసి రేసులో ఎవరెవరు? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను కాంగ్రెస్ లోని చాలామంది సీనియర్లు ఆశిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిని ఆశించిన భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎంతో పాటు పిసిసి పదవి హామీ దక్కినట్లు ప్రచారం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ అదిష్టానం ఆ హామీ ఇచ్చివుంటే భట్టి విక్రమార్కకు తెలంగాణ పిసిసి పగ్గాలు దక్కనున్నాయి. పక్కరాష్ట్రం కర్ణాటకలో డి.కె. శివకుమార్ మాదిరిగానే భట్టిని కూడా ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూనే కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించనున్నారు.

ఇక తాజాగా మరో మంత్రి సీతక్క పేరు తెరపైకి వచ్చింది. తనను పిసిసి చీఫ్ బాధ్యతల తొలగిస్తే సన్నిహితురాలైన సీతక్కకు ఇప్పించాలని సీఎం రేవంత్ చూస్తున్నారట. అప్పుడు ప్రభుత్వంతో పాటు  పార్టీ కూడా తనచేతిలోనే వుంటుందన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. 

ఇదిలావుంటే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు కూడా ఆశిస్తున్నారు. కానీ ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు జగ్గారెడ్డి, మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ లవి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుండి పోటీచేసిన జగ్గారెడ్డి, ఎల్బీ నగర్ నుండి పోటీచేసిన మధుయాష్కి ఓటమిపాలయ్యారు. దీంతో ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేకపోయిన వీరు పార్టీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. ఇక ప్రస్తుతం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్  మహేష్ కుమార్  గౌడ్ ప్రమోషన్   పై పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలు ఆశిస్తున్నారు.  
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios