హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుపై తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి మొగుడిని అవుతానంటూ ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ట్రాన్స్ జెండర్ అయ్యారని ఆయన శనివారం హైదరాబాదులో అన్నారు. 

కేసీఆర్ శిఖండిలా మారారని ఆయన  వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కేసీఆర్ మోడీ కాళ్లు పట్టుకున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరుగనీయబోమని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ కేసీఆర్ జాగీర్ కాదని, రైతు బంధు పథకం పచ్చి మోసమని ఆయన అన్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని జీవన్ రెడ్డి విమర్శించారు. తమ పార్టీ అధినేత సోనియా గాంధీ ఎక్కడ పుడితే ఏమిటని, ఆమె పేదల బాధలు తెలిసిన  మనిషి అని అన్నారు. 

శ్మశానవాటికలను,  డంపింగ్ యార్డులను కాంగ్రెసు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంతోనే అభివృద్ది చేస్తున్నారని ఆయన అన్నారు. మంత్రులను రోడ్లపై కూర్చోబెట్టిన కేసీఆర్ ఆ తర్వాత వ్యవసాయ బిల్లులపై యూటర్న్ తీసుకున్నారని ఆయన విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల అవకాశాలను పూర్తిగా దెబ్బ తీస్తాయని ఆయన అన్నారు. 

కనీస మద్దతు ధర లభిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.కాంగ్రెసు ప్రభుత్వం మాత్రమే రైతులకు మద్దతు కల్పించిందని, ధాన్యం కొనుగోలు దుకాణాలు తెరవకుంటే టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని జీవన్ రెడ్డి అన్నారు.