హైదరాబాద్:  తెలుగుదేశం పార్టీతో పొత్తుపై తెలంగాణ కాంగ్రెసు పార్టీ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన ఆ విషయాన్ని పట్టిస్తోంది. టీడీపితో సహా మిగతా ప్రతిపక్షాలను కలుపుకుని మహా కూటమి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుకు సాగుతూ వచ్చారు. 

అయితే, తాజా పరిణామాలు ఆయనను పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. టీడీపితో పొత్తుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను చేస్తున్న ప్రయత్నాలను ఆపేసినట్లు అర్థమవుతోందని అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని విభజన చట్టంలో చేర్చకపోవడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు కాంగ్రెసు పార్టీని తప్పు పట్టారు. విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెసు పార్టీపై విమర్శలు చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమను విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా టీడీపితో పొత్తును తెలంగాణ కాంగ్రెసు నాయకులు కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. 

సిపిఎం, సిపిఐ, కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జన సమితి, ఇతర పార్టీలతో మహా కూటమిని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని ఎదుర్కోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కొంత మంది తెలంగాణ కాంగ్రెసు నాయకులు భావించారు. అయితే, కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోబోమని సిపిఎం స్పష్టం చేసింది. 

తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర సెటిలర్ల మద్దతు ఉందనే ప్రచారంలో పూర్తి వాస్తవం లేదని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజీ పడ్డారనే అభిప్రాయం ఆంధ్ర సెటిలర్లలో ఉందని అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు మళ్లీ బిజెపి వైపు వెళ్లరనే గ్యారంటీ కూడా ఏమీ లేదు. ప్రత్యేక హోదా ఇవ్వని బిజెపిపైనే కాకుండా నాలుగేళ్ల పాటు బిజెపితో దోస్తీ కట్టిన చంద్రబాబుపై కూడా వారికి అసంతృప్తి ఉందని చెబుతున్నారు.

ఈ స్థితిలో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోయడం ఎందుకనే అభిప్రాయం కాంగ్రెసు నాయకులు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఊహించినంత బలం లేదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ తో ముఖాముఖి పోటీ ఉండేలా చూసుకోవడమే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దాంతో తెలుగుదేశం పార్టీపై పొత్తు పెట్టుకునే విషయంపై తెలంగాణ కాంగ్రెసు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.