త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధులను ప్రకటించింది కాంగ్రెస్. దీనిలో భాగంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ అభ్యర్ధిగా రాములు నాయక్.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ అభ్యర్ధిగా చిన్నారెడ్డిని ప్రకటించింది.

మరోవైపు అధికార టీఆర్ఎస్ కూడా ఎమ్మెల్సీ  ఎన్నికలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి మరోసారి పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఆదివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

పల్లా రాజేశ్వరరెడ్డి విజయం కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని త్వరలోనే నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఇక, పల్లా రాజేశ్వరరెడ్డి ప్రస్తుతం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.