కాంగ్రెస్ చరిత్రలోనే తెలంగాణ సీఎం సరికొత్త రికార్డ్...
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ రికార్డ్ బ్రేక్ చేసింది. కేవలం 48 గంటల్లోనే ముఖ్యమంత్రిని తేల్చేసింది.
ఢిల్లీ : తెలంగాణతోపాటు దేశంలోని మరో నాలుగు రాష్ట్రాలకి గత నెలలో ఎన్నికలు జరిగాయి. వీటిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాంలు ఉన్నాయి. అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు ఒకేసారి డిసెంబర్ 3న వెలుపడ్డాయి. మిజోరాంలో మాత్రం ఒక్కరోజు ఆలస్యంగా డిసెంబర్ 4న ఫలితాలు వెలుగు చూశాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో చూస్తే.. రాజస్థాన్, ఛతీస్ఘడ్, మధ్యప్రదేశ్ లలో బిజెపి హవా చూపించింది. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టింది. ఇక మిజోరాం సంగతికి వస్తే.. అక్కడ స్థానిక పార్టీలదే హవా. స్థానికంగా ఉన్న ఎమ్ఎన్ఎఫ్, జడ్పీఎం తరువాతే కాంగ్రెస్ అయినా, బిజెపి అయినా. ఈ రెండు పార్టీలు అక్కడ నామమాత్ర సీట్లతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఆలస్యం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇలా ఉంటుందంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సందు దొరికింది కదా అని కాంగ్రెస్ లోని కుమ్ములాటలపై విరుచుకుపడుతున్నారు. కానీ.. మిగతా మూడు రాష్ట్రాల్లో ఎన్నికైన బిజెపి కూడా ఇప్పటికీ ఇంకా ముఖ్యమంత్రిలను ఎన్నుకోలేదు. రాష్ట్రాలన్ని నడిపించే నాయకత్వం విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
Telangana CM : రేవంత్ రెడ్డికి.. హీరో మహేష్ బాబుకు ఇష్టమైన వ్యక్తి ఒక్కరే..
అదే కాంగ్రెస్ విషయానికి వస్తే రికార్డు స్థాయిలో ఫలితాలు వచ్చిన రెండు రోజుల్లోనే.. అంటే దాదాపు 48 గంటల్లోనే ముఖ్యమంత్రిని ప్రకటించింది. కాంగ్రెస్ చరిత్రలోనే ఇంత తొందరగా ముఖ్యమంత్రి విషయంలో నిర్ణయానికి రావడం ఇదే మొదటిసారి. మరోవైపు బిజెపి నాయకత్వం మూడు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కోసం తొందర పడుతున్నట్టుగా కనిపించడం లేదు. పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపిన సమాచారం ప్రకారం ఈ వారం చివరిలోగా ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రిల ఎంపిక జరగనున్నట్లుగా తెలుస్తోంది.
దీనికోసం బిజెపి నాయకత్వం మూడు రాష్ట్రాల నుండి.. అభిప్రాయాలను విస్తృతంగా సేకరిస్తుంది. సంప్రదింపులు, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్యాలను మంగళవారం నాడు మధ్యప్రదేశ్ నేతలు కలిశారు. మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో పార్టీలో కలకలం చెలరేగింది. దీంతో నడ్డా, అమిత్ షాలు రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, ఎన్నికల ఇన్చార్జి ఉపేంద్ర యాదవ్ లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మిగతా నేతల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నారు.
ఇక రాజస్థాన్ విషయానికి వచ్చేసరికి వసుంధర రాజేకు మద్దతుగా ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు.. . ఈ విషయంపై కూడా పార్టీ ఓ కన్నేసి ఉంచింది. రాజస్థాన్లో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కోసం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ఇన్చార్జి అరుణ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు సిపి జోషి జైపూర్ లోనే ఉన్నారు. ఏతావాతా చెప్పేది ఏంటంటే.. జాతీయ పార్టీ అన్నాక జాగు ఉంటుంది. ఒక్కరాష్ట్రంలో తేలిపోయేది కాదు. ఆ రాష్ట్రంలో తీసుకునే నిర్ణయం మిగతా రాష్ట్రాలలో కూడా ప్రభావం చూడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అన్ని సమీకరణాలు, అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.