Asianet News TeluguAsianet News Telugu

కాకతీయ తోరణం, చార్మినార్ తొలగింపు ..? రేవంత్ మార్క్ తెలంగాణ చిహ్నం రెడీ...

తెలంగాణలో తన మార్క్ పాలనను సాగిస్తున్న రేవంత్ రెడ్డి కీలక మార్పులు చేపట్టారు. అందులో భాగంగానే జూన్ 2న తెలంగాణ గీతం, కొత్త అధికారిక చిహ్నం విడుదలకు సిద్దమయ్యారు. తెలంగాణ చిహ్నం ఎలా వుండనుందంటే... 

Telangana CM Revanth Reddy  approved New state emblem AKP
Author
First Published May 27, 2024, 10:21 PM IST

హైదరాబాద్ : గత పదేళ్లు ఒక లెక్క... ఇప్పుడు మరోలెక్క అన్నట్లుగా తెలంగాణలో పాలన సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు తెలంగాణ పాలనా పద్దతి పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ పేరు ఎక్కడా గుర్తురావద్దు అనేలా కాంగ్రెస్ నిర్ణయాలు వుంటున్నాయి... ఇలా రేవంత్ మార్క్ పాలన రాష్ట్రంలో సాగుతోంది. ప్రగతి భవన్, సచివాలయం పేర్లుతో మొదలైన మార్పులు ప్రస్తుతం రాష్ట్ర అధికారిక చిహ్నం వరకు సాగాయి.  

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు : 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ తన ఇష్టానుసారంగా వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలా రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా రాచరికం ప్రతిబింబించేలా రూపొందించారన్నది కాంగ్రెస్ నాయకుల వాదన. అందుకోసమే గత పదేళ్లుగా ఉపయోగించిన రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చేందుకు రేవంత్ సర్కార్ సిద్దమయ్యింది.  

ప్రస్తుతం తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణంతో పాటు చార్మినార్ చిత్రాలు వున్నాయి. వీటిపైనే రేవంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాచరికాన్ని ప్రతిబింబించే వీటిని తొలగించి ప్రజాస్వామ్యాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందించాలన్నది రేవంత్ ఆలోచన. అందుకు తగినట్లుగా కొత్త అధికారిక చిహ్నాన్ని రూపొందించే బాధ్యతను ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశంకు అప్పగించింది కాంగ్రెస్ సర్కార్. 

అయితే తాజాగా రుద్ర రాజేశం బృందం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది. ఈ క్రమంలోనే తాము రూపొందించిన 12 నమూనాలను సీఎంకు చూపించగా అందులో ఒకదాన్ని ఆయన ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఆ చిహ్నంలోనూ కొన్ని మార్పులు చేర్పులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ అధికారిక చిహ్నానికి  రుద్ర రాజేశం టీం తుది మెరుగులు దిద్దుతోంది.  జూన్ 2న అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజునే ఈ అధికారిక చిహ్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 

 

తెలంగాణ గీతంగా జయజయహే తెలంగాణ :

'జయజయహే తెలంగాణ జననీ జయ కేతనం... ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం' అంటూ సాగే ఉద్యమగీతం తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమకాలంలో అందరినోట వినిపించిన ఈ పాట రాష్ట్ర ఏర్పాటు తర్వాత మాత్రం వినిపించలేదు. గత పదేళ్లుగా మరుగునపడ్డ ఈ గీతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ రచయిత రాసిన ఈ పాటను రాష్ట్ర గీతంగా రేవంత్ సర్కార్ ప్రకటించింది. 

అయితే జయజయహే తెలంగాణ గీతాన్ని యధావిధిగా కాకుండా కాస్త మార్పులుచేర్పులు చేయిస్తోంది తెలంగాణ సర్కార్. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ గేయాన్ని మూడు వెర్షన్స్ లో సిద్దంచేయగా ఇటీవలే వాటిని సీఎం రేవంత్ విన్నారు. వాటిలో 2.30 నిమిషాల నిడివి గల గీతానికి ఆయన ఓకే చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో పాడుకోడానికి వీలుగా వుండేలా ఈ గీతాన్ని రూపొందించారు... దీన్ని కూడా తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున విడుదల చేయనున్నారు. 

తెలంగాణ తల్లి విగ్రహ మార్పు : 

ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామని అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతమున్న తెలంగాణ తల్లి విగ్రహం కూడా తలపై కిరీటంతో రాచరికానికి చిహ్నంగా వుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వారి డిమాండ్ ను పరిగణలోకి తీసుకునే తెలంగాణ అస్తిత్వం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేపడతామని రేవంత్ కేబినెట్ ప్రకటించింది.  

టిఎస్ కాస్త టిజిగా : 

తెలంగాణ ఉద్యమ సమయంలో టిజి అనే పదం వినిపించేది, కనిపించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దాన్ని టిజిగా పిలుచుకోవాలని, వాహనాలపై టిజి వుంటుందని అందరూ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం టిజి కాదని టీఎస్ ను ఖరారు చేసారు. తన టిఆర్ఎస్ పార్టీతో టీఎస్ పదం కలుస్తుందనే కేసీఆర్ ఉద్యమకారులు ఆకాంక్షకు విరుద్దంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వున్నాయి. 

అయితే గత పదేళ్లుగా కొనసాగిన టీఎస్ ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టిజిగా మార్చింది. ఇకపై తెలంగాణ రాష్ట్రాన్ని టిజిగా సంబోధించేలా చర్యలు తీసుకుంది. అంతేకాదు కొత్త వాహనాల నంబర్ ప్లేట్లపై టిఎస్ కాకుండా టిజి వుండేలా చర్యలు తీసకుంది రేవంత్ సర్కార్. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios