Asianet News TeluguAsianet News Telugu

ORR Toll Tenders:  అవుటర్ టోల్ టెండర్లపై ఎంక్వయిరీ..  సీఎం రేవంత్ ఆదేశం 

ORR Toll Tenders:  తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి  ఆదేశాలు జారీ చేశారు. 

Telangana CM Revanth orders enquiry into ORR toll tenders KRJ
Author
First Published Feb 29, 2024, 12:41 AM IST

ORR Toll Tenders:  తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి  ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను నిలదీశారు. ఈ టెండర్ల ప్రక్రియలో ఎవరెవరి ప్రమేయముందో? ఏయే సంస్థలున్నాయో? ఎవరెవరు బాధ్యులెవరో ? అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రా పాలీ కి బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే.. వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత  కేబినేట్లో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని సీఎం చెప్పారు. బుధవారం సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతి నెలా గరిష్ఠంగా టోల్ వసూళ్లతో ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎం వివరించారు. అలాంటప్పుడు 30 ఏండ్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని కేవలం రూ.7,380 కోట్లకు ఐఆర్ బీ కంపెనీకి ఎలా అప్పగించారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. హెచ్ఎండీఏ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. హెచ్ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్ తయారు చేయించటం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే  డీపీఆర్ ను ఎంచుకుందని చర్చకు వచ్చింది. అందుకే ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేయిస్తేనే, నిజాలు బయటకు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్ ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

అవుటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్రమంగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం ఉండేలా రేడియల్ రోడ్లు నిర్మించాలని చెప్పారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ ను రూపొందించాలని సీఎం సూచించారు. 

హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెర్వులు, కుంటలను పరిరక్షించాలని, మరోవైపు ల్యాండ్ ఫూలింగ్ను వేగవంతం చేయాలని సీఎం చెప్పారు. అవసరమైతే ల్యాండ్ ఫూలింగ్, అక్కడి స్థలాల అభివృద్ధి విషయంలో జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని, సమన్వయంతో పని చేయాలని సూచించారు. హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్ పార్శిళ్లు ఉన్నాయి. వీటిలో 2031 పార్శిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయి. హెచ్ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, డిజిటల్, జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్ చేయాలని సీఎం సూచించారు. తమ పరిధిలో ఉన్న స్థలాలతో హెచ్ఎండీఏ ఆదాయం పెంచుకునే చర్యలు చేపట్టాలని చెప్పారు. అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ల్యాండ్ ఫూలింగ్, ల్యాండ్ పార్శిల్స్, చెర్వులు, కుంటలు ఆక్రమణకు గురవకుండా చూసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సమావేశంలో చర్చ జరిగింది. డీఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించాలని, ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios