హెచ్‌సీయూకి పీవీ పేరు పెట్టండి... ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ
ప్రధాని నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఇవాళ్టీ నుంచి జరుపుతున్నామని లేఖలో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఇవాళ్టీ నుంచి జరుపుతున్నామని లేఖలో పేర్కొన్నారు. 1991లో ఆర్ధిక సంస్కరణలు చేపట్టి కుదేలైపోయిన ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టారని సీఎం గుర్తుచేశారు.
భరత మాత ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి.. అనేక ఇతర రంగాల్లో సైతం ఆయన విశిష్ట సేవలు అందించారని కేసీఆర్ ప్రశంసించారు.
విద్యారంగంలో పీవీ తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మకమన్న ముఖ్యమంత్రి అప్పటి సమైక్య రాష్ట్రంలో ఆయన ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నవోదయ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లోని పేద, చురుకైన విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాయన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేసీఆర్.. ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
Also Read:పీవీకి సరైన గౌరవం దక్కలేదు: కేసీఆర్
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు పీవీ సమాధి వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
దేశంలో ఆర్ధిక సంస్కరణలకు పీవీ నరసింహారావు ఆద్యుడు అని ఆయన గుర్తు చేశారు. పీవీ వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవని చెప్పారు. ప్రపంచదేశాలన్నీ ఆసియా వైపు చూసేలా చేసిన వ్యక్తి పీవీ అంటూ ఆయన కొనియాడారు.
పీవీ మన తెలంగాణ ఠీవీ అని ఆయన కితాబునిచ్చారు. 360 డిగ్రీల పర్సనాలిటీ పీవీ నరసింహారావు అని ఆయన ప్రశంసించారు.ఈ రోజు తన మనసుకు చాలా ఉల్లాసంగా ఉందని కేసీఆర్ చెప్పారు.