పీవీకి సరైన గౌరవం దక్కలేదు: కేసీఆర్
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధానమంత్రి పదవి పీవీ నరసింహారావుకు దక్కిందని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు.
ప్రధాని పదవి కోసం ఆయన పాకులాడలేదన్నారు. పదవే ఆయనను వరించిందని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్: దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధానమంత్రి పదవి పీవీ నరసింహారావుకు దక్కిందని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు.
ప్రధాని పదవి కోసం ఆయన పాకులాడలేదన్నారు. పదవే ఆయనను వరించిందని ఆయన గుర్తు చేశారు.
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు పీవీ సమాధి వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.దేశంలో ఆర్ధిక సంస్కరణలకు పీవీ నరసింహారావు ఆద్యుడు అని ఆయన గుర్తు చేశారు. పీవీ వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవని చెప్పారు.
అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అని సీఎం కేసీఆర్ కొనియాడారు. గొప్ప సంస్కరణశీలి. ఎక్కడ ఏ రంగంలో పీవీ నరసింహారావు అడుగుపెడితే అక్కడ సంస్కరణలు తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సర్వేల్ లో గురుకుల పాఠశాలను స్థాపించిన వ్యక్తి పీవీ నరసింహారావు అని ఆయన గుర్తు చేశారు. జైళ్ల శాఖలో కూడ ఓపెన్ జైళ్ల పద్దతిని తీసుకొచ్చిన చరిత్ర పీవీదేనని ఆయన చెప్పారు.ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే భూ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పీవీ నరసింహారావు ఆయన గుర్తు చేశారు.
ప్రపంచదేశాలన్నీ ఆసియా వైపు చూసేలా చేసిన వ్యక్తి పీవీ అంటూ ఆయన కొనియాడారు. పీవీ మన తెలంగాణ ఠీవీ అని ఆయన కితాబునిచ్చారు. 360 డిగ్రీల పర్సనాలిటీ పీవీ నరసింహారావు అని ఆయన ప్రశంసించారు.ఈ రోజు తన మనసుకు చాలా ఉల్లాసంగా ఉందని కేసీఆర్ చెప్పారు.
పీవీకి సరైన గౌరవం దక్కలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పీవీ నరసింహారావు రాసిన రచనలను అన్ని భాషల్లో ముద్రించి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్శిటీలకు పంపుతామని సీఎం కేసీఆర్ చెప్పారు.
పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ, కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. తన నేతృత్వంలో అన్ని పార్టీలను తీసుకెళ్లి పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్టుగా ఆయన చెప్పారు.
పార్లమెంట్ లో పీవీ చిత్రపటాన్ని కచ్చితంగా పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కూడ పీవీ నరసింహారావు చిత్ర పట్టాన్ని ఏర్పాటు చేయాలని ఆయన స్పీకర్ ను కోరారు.