ఆర్టీసీ కార్మికులతో సమావేశమయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. డిసెంబర్ 1 ఆదివారం ప్రగతి భవన్‌లో సమావేశం కావాలని ఆయన నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను సమావేశానికి ఆహ్వానించాలని... వీరిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళలు ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

వీరు ప్రగతిభవన్ చేరుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సందిగా కేసీఆర్ ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. అలాగే ఈ సమావేశానికి వచ్చే కార్మికులలో అన్ని వర్గాలకు చెందిన వారి భాగస్వామ్యం ఉండేలా చూడాలన్నారు.

Also Read:నవంబర్ 29తో జగన్ కు లింకేంటి: ఆ నిర్ణయం తీసుకోకపోతే సీఎం అయ్యేవారే కాదా...

డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటల కల్లా కార్మికులను ప్రగతి భవన్ తీసుకురావాలని.....వీరికి అక్కడే భోజన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

అనంతరం కేసీఆర్ కార్మికులతో ముఖాముఖి నిర్వహించి... ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలు హాజరవుతారు.

అంతకుముందు ఆర్టీసీ కార్మికులను బేషరతుతుగా విధుల్లోకి చేర్చుకోవడానికి అనుమతించిన ముఖ్యమంత్రికి మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్‌కు వచ్చిన అజయ్ కుమార్... ఆర్టీసీ మనుగడను కాపాడటానికి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

కాగా గురువారం ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలకాలని తాము నిర్ణయించామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ శుక్రవారం ఉదయం యధావిథిగా విధులకు హాజరు కావొచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రమే తమకు రూ.22 వేల కోట్లు ఇవ్వాలని, కానీ కేంద్రం వాటా గురించి చెప్పేవాళ్లు ఈ డబ్బు ఇప్పిస్తారా అని సీఎం ప్రశ్నించారు.

ఆర్టీసీకి తక్షణ సాయంగా రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి నష్టాలను పూడ్చేందుకు ఆసరా కల్పిస్తామని... కి.మీ.20 పైసలు చొప్పున పెంచుతామని సోమవారం నుంచి ఛార్జీలు అమల్లోకి వస్తాయని సీఎం స్పష్టం చేశారు.

కార్మికులు విధుల్లో చేరడానికి ఎలాంటి షరతులు లేవని... త్వరలో కార్మికులతో తానే స్వయంగా మాట్లాడతానని కేసీఆర్ తెలిపారు. మేమన్న ప్రైవేటీకరణ వేరని... బయట ప్రచారం చేసింది వేరని, ప్రైవేట్ పర్మిట్లు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఇద్దామనుకున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Also Read:యూనియన్ నేతలకు కేసీఆర్ షాక్: ఆ డ్యూటీలు క్యాన్సిల్

వచ్చే వారంలో ప్రతి డిపో నుంచి ఐదుగురిని పిలిచి తానే స్వయంగా మాట్లాడతానని సీఎం తెలిపారు. ఆర్టీసీ ఆర్ధిక పరిస్ధితిని 49 వేల మంది కార్మికులకు తెలియజేస్తామని...యూనియన్ నేతలను దగ్గరకి రానివ్వమని కేసీఆర్ వెల్లడించారు.