నవంబర్ 29తో జగన్ కు లింకేంటి: ఆ నిర్ణయం తీసుకోకపోతే సీఎం అయ్యేవారే కాదా...
నవంబర్ 29న జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకపోతే ఈనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదని, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా లేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆనాడు జగన్ తీసుకున్న నేడు ముఖ్యమంత్రిని చేసిందని తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి నవంబర్ 29 జీవితంలో మరచిపోని రోజుగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నవంబర్ 29న జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. ఐదు కోట్ల మందికి అధిపతిని చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంతకీ జగన్ తీసుకున్న నిర్ణయం ఏంటనుకుంటున్నారా..? ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధానికి స్వస్తి పలికిన రోజు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన రోజు నవంబర్ 29న కావడం విశేషం.
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక కొందరు ఆయన అభిమానులు చనిపోయారు. వారి కుటుంబాల్లో మనోధైర్యం నింపేందుకు జగన్ ఓదార్పుయాత్రకు శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.
అయితే అందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు చెప్పడం, కాంగ్రెస్ పార్టీ నేతలే వైయస్ కుటుంబంపై విమర్శలకు దిగడంతో తట్టుకోలేకపోయారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా జగన్ ఆస్తులపై కూడా కాంగ్రెస్ నేతలు కేసులు పెట్టడంపై ఆగ్రహం జగన్ వర్గం వ్యక్తం చేశారు.
అటు వైయస్ జగన్ కుటుంబం సైతం కాంగ్రెస్ పార్టీ పెడుతున్న ఇబ్బందులను సహించలేకపోయింది. దాంతో భవిష్యత్ కార్యచరణపై జగన్ వర్గమైన ఎమ్మెల్యేలు, కీలక నేతలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
నవంబర్ 29న కడప ఎంపీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. రాజీనామా అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి బయటకు వచ్చి ప్రజలకు తన తల్లి వైయస్ విజయమ్మతో కలిసి అభివాదం చేశారు. వైయస్ జగన్ కు అండగా ఉండాలంటూ విజయమ్మ ప్రజలను కోరారు.
అదేరోజు భవిష్యత్ కార్యచరణపై కీలక ప్రకటన చేశారు వైయస్ జగన్. కాంగ్రెస్ పార్టీతో నెలకొన్న బంధానికి నేటితో ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకొచ్చారు. త్వరలోనే నూతన పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అనంతరం 2011 మార్చి 11న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు వైయస్ జగన్.
వైయస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవినావభావ సంబంధం ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారానే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మధ్యలో రెడ్డి కాంగ్రెస్ పెట్టినప్పటికీ తిరిగి అనంతరం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అహర్నిశలు శ్రమించారు. ప్రజాప్రస్థానం పేరుతో రాష్ట్రర వ్యాప్తంగా పర్యటించి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ప్రజలకు చేరువయ్యేలా సంక్షేమ పథకాలను అమలు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎలాంటి హామీలు ఇవ్వకుండానే 2009 ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు.
2009 ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రచ్చబండ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వెళ్తూ 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
నవంబర్ 29న జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకపోతే ఈనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదని, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా లేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆనాడు జగన్ తీసుకున్న నేడు ముఖ్యమంత్రిని చేసిందని తెలిపారు.