హైదరాబాద్: ఆర్టీసీ యూనియన్ నేతలకు షాక్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మెుదటి నుంచి ఆర్టీసీ కార్మికులపై ఒక స్థాయిలో విరుచుకుపడే కేసీఆర్ సమ్మె పూర్తి అయిన తర్వాత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.  

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేరాలని సూచించిన సమయంలో కూడా యూనియన్ నేతలపై కేసీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. యూనియన్ నేతలను నమ్మవద్దని పదేపదే ఆర్టీసీ కార్మికులకు హెచ్చరించారు. 

అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడం, తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రెస్మీట్ పెట్టిన కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరొచ్చని సూచించారు. 

ఆ మరుసటి రోజే యూనియన్ నేతలకు షాక్ ఇచ్చారు కేసీఆర్. యూనియన్ నేతలకు రిలీఫ్ డ్యూటీలు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో యూనియన్ నేతలకు రిలీఫ్ డ్యూటీలు ఉండేవి. డ్యూటీలు చేయకపోయినా వారికి జీతాలు చెల్లించేది ఆర్టీసీ యాజమాన్యం. 

అయితే సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు యూనియన్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్ తన చర్యలకు పదునుపెట్టారు. యూనియన్ నేతలకు రిలీఫ్ డ్యూటీలను రద్దు చేయాలని నిర్ధారించారు. అందులో భాగంగా ఆర్టీసీ యాజమాన్యం రిలీఫ్ డ్యూటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.